విజయవాడ తెలుగుదేశం పార్టీ రాజకీయం కొన్ని కొత్త పాఠాలను నేర్పుతోంది. పార్టీకి సంబంధించినంత వరకు ఆశాజనకమైన సంగతులు అవి. విజయవాడ తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని కొంత కాలంగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉంటున్నారనే సంగతి అందరికీ తెలుసు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా మళ్లీ పోటీచేసే ఉద్దేశం తనకు లేనే లేదని కేశినేని నాని చాలా కాలం నుంచి చెబుతున్నారు. ఎటూ తనకు పోటీచేసే ఉద్దేశం లేదు గనుక.. తనను గెలిపించిన తెలుగుదేశం పార్టీ మీద ఈలోగా బోలెడంత బురద చల్లేసి వెళ్లిపోవాలని ఆయన కంకణం కట్టుకున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం పెద్ద విశేషం కాదు. అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు పాల్గొన్నారని సరిపెట్టుకోవచ్చు. కానీ.. వారితో ఉన్న కార్యక్రమాల్లో అధికార పార్టీ వారిని కీర్తించడం, అదే సమయంలో తెలుగుదేశం నాయకుల మీద చులకనగా మాట్లాడడం అనేవి మాత్రం ఇబ్బందికరమైన అంశాలు. కేశినేని నాని ఈ తీరుగా మాట్లాడుతుండడంతో.. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరబోతున్నారనే భావం ధ్వనించేలా.. వైసీపీ నాయకులందరూ ఎడ్వాంటేజీ తీసుకోవడం ప్రారంభించారు. కేశినేని నాని చాలా మంచి నాయకుడు అని, ఆయన వస్తే తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని ఇలా సన్నాయి నొక్కులు నొక్కడం ప్రారంభించారు. కేశినేని మాత్రం వైసీపీ చేతికి తానే అస్త్రాలు అందిస్తున్నట్టుగా తెలుగుదేశం ఇన్చార్జిలు అందరూ చేతగానివాళ్లు అంటూ విమర్శలు చేయడం ఇంకో ఎత్తు.
అయితే తెలుగుదేశం నాయకులు మాత్రం నాని విషయంలో చాలా సంయమనంతోనే వ్యవహరిస్తుండడం గమనించదగ్గ సంగతి. బుద్దా వెంకన్న విషయంలో కూడా కేశినేని నాని ఎద్దేవా చేస్తూ నిప్పులు చెరగుతుంటారు. కానీ ఇదే విషయాన్ని వెంకన్న దగ్గర ప్రస్తావించినప్పుడు.. తమ ఇద్దరికీ అభిప్రాయ భేదాలు ఉన్న మాట వాస్తవమే గానీ.. తాను నాని వ్యాఖ్యలపై స్పందించబోనని చెప్పడం విశేషం. వెంకన్న కూడా స్పందించి ఇంకో మాట అంటే.. రచ్చ పెరుగుతుందే తప్ప తగ్గదు. ఇలాంటి విషయాలను భూతద్దంలో చూపించి ప్రచారం చేస్తూ పార్టీ మీద దుష్ప్రచారానికి ప్రత్యర్థి పార్టీలు సదా ఎగబడుతుంటాయి. వెంకన్న మౌనంగా ఉండడం అనేది ప్రత్యర్థులకు ఆ అవకాశం ఇవ్వదు.
నిజానికి ప్రతి పార్టీలోనూ గ్రూపులు, వారిమధ్య తగాదాలు ఉంటాయి. కానీ విస్తృత పార్టీ ప్రయోజనాలను కోరుకునేప్పుడు.. ఇలా సంయమనం పాటించడం అనేది చాలా ముఖ్యం. ఈ సర్దుబాటు ధోరణి అందరు నాయకుల్లో ఉన్నట్లయితే.. పార్టీలకు ఎలాంటి చికాకులు ఉండవు. విజయవాడ ఎపిసోడ్ ను గమనిస్తోంటే.. తమ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలు బజార్న పడకుండా చంద్రబాబునాయుడు వీలైనంత నియంత్రిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఈ సర్దుబాటు ధోరణి ఉంటేనే పార్టీకి మనుగడ!
Monday, December 23, 2024