కేంద్రంలోని బిజెపి సర్కారుమీద నిప్పులు చెరగడం ఎలాగ? దానికి తగ్గట్టుగా ఏదోక కారణాలు వెతుక్కోవడం ఎలాగ? అనే విషయాల్లో భారాస సారధి కేసీఆర్ నిత్యాన్వేషణలో గడుపుతూ ఉంటారు. అలాంటి కేసీఆర్ కు ఇప్పుడు లడ్డూ లాంటి అవకాశం కలిసివచ్చింది. ఏమేరకు వర్కవుట్ అవుతుందనే సంగతి పక్కన పెడితే.. ఆయన కేంద్రంలోని బిజెపి మీద విమర్శలు రువ్వడానికి ఒక మంచి చాన్స్ వచ్చింది. కాకపోతే.. ఈ చాన్స్ ఆయనకు పెద్ద షాక్ కూడా! పాపం.. ఆ షాక్ లోంచి తేరుకుని.. ఆ తర్వాత నిప్పులు చిమ్మే విమర్శలకు పూనుకోవాలి.
ఇంతకూ విషయం ఏంటంటే.. భారాసకు చెందిన ఎమ్మెల్యేలను తమలో చేర్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఎర వేసిందని, ఒక్కొక్కరికి 50 కోట్ల రూపాయల ఆఫర్ తో మొత్తం 200 కోట్ల డీల్ నడిపిందనే ఆరోపణలతో ఒక ఎపిసోడ్ ప్రస్తుతం నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి.. పైలట్ రోహిత్ రెడ్డి కేంద్రంగా నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు (ఫిరాయింపునకు) ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. వారు ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్నారు. ఈ కేసును సిట్ ప్రత్యేకంగా విచారిస్తోంది. ఈ ఫిరాయింపు వ్యవహారంతో సంబంధం ఉన్నదనే అనుమానంతో విచారించడానికి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ సహా మరికొందరు ప్రముఖులకు నోటీసులు ఇవ్వడం వారు ఖాతరు చేయకపోవడం కూడా జరుగుతోంది.
ఈనేపథ్యంలో తాజాగా హైకోర్టు ఈ ‘ఎమ్మెల్యేలకు ఎర’ అనే వ్యవహారాన్ని దర్యాప్తు చేసే అధికారం సీబీఐకు అప్పగిస్తూ తీర్పు చెప్పడం సంచలనాత్మకంగా మారింది. ఈ కేసులో.. బిజెపికి చెందిన ప్రతినిధులు అని అంటూ.. ముగ్గురిని అరెస్టు చేసి సిట్ విచారణ మొదలెట్టిన నాటినుంచి.. బిజెపి నాయకులు.. రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదని, సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేస్తున్నారు. సిట్ వివరాలన్నీ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో చెబుతున్నారంటూ.. ఆరోపణలు చేశారు. అయితేకేంద్రం దర్యాప్తు సంస్థలను వాడుకుంటోంది అని ఆరోపించే కేసీఆర్.. సీబీఐ విచారణకోసం జరుగుతున్న డిమాండ్ ఎద్దేవా చేశారు. కానీ చివరికి అదే జరిగింది.
రాష్ట్రప్రభుత్వ వాదనలను తోసిపుచ్చి.. ఈ కేసును పూర్తిగా సీబీఐ విచారించేలా హైకోర్టు ఆదేశించింది. రాజకీయ దురుద్దేశాలతో ఈ కేసు పెట్టినట్టుగా బిజెపి తరఫు వాదనను రాష్ట్రప్రభుత్వం ఎదుర్కోలేకపోయింది.
అయితే.. కేసీఆర్ కు షాక్ ఇచ్చేలా కేసు సీబీఐ చేతికి వెళ్లిపోయి ఉండొచ్చు గానీ.. దీనిమీద ఆయన త్వరలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి.. కేంద్రాన్ని దుమ్మెత్తిపోయడానికి వాడుకోవచ్చునని అంతా అంచనా వేస్తున్నారు.
ఈ షాక్‌కు కేసీఆర్ ఆగ్రహిస్తారేమో!?
Wednesday, December 25, 2024