ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో.. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించారు. ఒక పెద్ద పార్టీకి చెందిన నాయకుడిగా.. ఆయన పాదయాత్ర నిర్వహిస్తే.. ఏర్పాట్లు, శాంతిభద్రతల పరంగా ఎన్ని సమస్యలు ఉంటాయో అందరికీ తెలుసు. కానీ.. అప్పట్లో ప్రభుత్వం సహకరించింది. అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే.. జగన్ భయపడిపోతుంటారు. ప్రధానంగా జనసేనాని పవన్ కల్యాణ్.. జనవాణి పేరుతో ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించడానికి చేసే ప్రయత్నాల పట్ల ప్రభుత్వం జడుసుకుంటోందా? అనే అభిప్రాయం పలువురిలో ఉంది. విశాఖపట్టణంలో జనసేనాని పవన్ కల్యాణ్ జనవాణి నిర్వహించదలచుకుంటే.. గతంలో అడ్డుకున్న వైసీపీ సర్కారు ఈసారి మళ్లీ అడ్డుకోవడం సాధ్యం కాదని అందరూ భావిస్తున్నారు.
పవన్ కల్యాణ్ తన మూడో విడత వారాహి పాదయాత్రను విశాఖపట్టణంలో నిర్వహించనున్నారు. పదోతేదీనుంచి జరిగే ఈ యాత్రను విజయవంతం చేయాలని నాదెండ్ల మనోహర్ పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వారాహి యాత్రలో భాగంగా పవన్ జనవాణి కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. విశాఖ వాసుల కష్టాలను స్వయంగా తెలుసుకుని, వారినుంచి విజ్ఞప్తులు స్వీకరించనున్నారు.
గతంలో పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమం నిర్వహించడం కోసం విశాఖ వెళ్లినప్పుడు పోలీసులు ఎంత యాగీచేశారో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చిన పవన్ ను, కార్యక్రమం నిర్వహించనివ్వకుండా దాదాపుగా గృహనిర్బంధం చేశారు. హోటల్ గదిలోంచి బయటకు కదలనివ్వలేదు. నిజం చెప్పాలంటే అమానుషంగా వ్యవహరించారు. అప్పట్లో పోలీసుల తీరు సర్వత్రా విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈసారి పరిస్థితి మారుతోంది. విపక్ష నాయకుల కార్యక్రమాలను పోలీసు మరియు అధికార బలంతో అడ్డుకుంటూ ఉంటున్న ప్రతిసారీ.. వారు న్యాయస్థానాల అండతో తమను ఎదురుదెబ్బ కొడుతున్నారని ప్రభుత్వం గ్రహించింది. అందుకే పవన్ కల్యాణ్ విశాఖ వారాహి యాత్రకు గానీ, జనవాణి కార్యక్రమానికి గానీ.. అడ్డంకులు సృష్టించే ప్రయత్నంలో లేదని అర్థమవుతోంది.