ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలను నమ్మేవారు, ఆయన చెప్పే మాటలకు ముడిపెట్టి ఆశలను పెంచుకునేవారు కొంతమంది తప్పకుండా ఉంటారు. అలాంటి వారందరికీ సెప్టెంబరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విశాఖపట్నం వచ్చేస్తుందనే ఆశ ఉండవచ్చు. కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం వల్ల మాత్రమే కాకుండా, ఉత్తరాంధ్ర జిల్లాలకు పార్టీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఆయన బాబాయి వైవి సుబ్బారెడ్డి కూడా పదేపదే సెప్టెంబర్ లో రాజధాని పూర్తిస్థాయిలో విశాఖపట్నానికి తరలివచేస్తుందని వెల్లడించడం ద్వారా ఒక వర్గం ప్రజలలో ఆశలు రేకెత్తించారు. అలాంటి ఆశలు పెట్టుకున్న వారు ఎవరైనా ఉంటే వారు మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఎందుకంటే దసరా నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కోరుకుంటున్న ఒక శుభపరిణామం జరుగుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా వెల్లడించారు. తద్వారా రాజధాని విశాఖపట్నానికి దసరా నాటికి రానుందని ఆయన సంకేతాలు ఇచ్చారు.
సెప్టెంబర్ లో విశాఖకు రాజధాని అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఊదరగొడుతున్న తరుణంలో తాజాగా అది దసరాకు వాయిదా పడింది. దసరా అంటే ఈ ఏడాది అక్టోబర్ 24వ తేదీన వస్తుంది. అంటే ఏకంగా నెల వాయిదా పడ్డట్లు అనుకోవాలి. దసరా నాటికి తరలింపు చేతకాకపోతే మళ్లీ అధికార పార్టీ నాయకుల నోటి నుంచి ‘సంక్రాంతి’ అనే మాట వినిపించవచ్చు. అప్పటికీ వారి వల్ల కాకపోతే, ‘ఉగాది’ అనే మాట రావచ్చు. ఆ తరువాత ఇక చెప్పడానికి ఏమీ ఉండదు.. ఎన్నికల తర్వాత కొత్త రాజధాని అని మాయ చేయడం మాత్రమే!
నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నం తరలించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలుకాకుండా హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు వెళ్లడంతో ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీం ధర్మాసనం ఏ సంగతి తేలిస్తే తప్ప, తుది తీర్పు వెల్లడిస్తే తప్ప విశాఖకు రాజధాని వెళ్లే అవకాశం లేదు. అయితే ఆ మాట చెప్పకుండా.. ఉత్తరాంధ్రలో ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవాలని ఆరాటపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా కాలంగా రాజధాని తరలింపు ఇదిగో అంటూ మాయ మాటలు చెబుతూ వస్తోంది. సుమారుగా ఏడాదిన్నర కాలం నుంచి ప్రతి పండగ సీజనుకు ముందు రాజధాని తరలింపు అనే మాట వారి నుంచి వినిపిస్తోంది. ఇటీవల కాలంలో సెప్టెంబరులో తాను కాపురం విశాఖకు మార్చబోతున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తర్వాత ఇలాంటి వార్తలకు ఊపు వచ్చింది.
జగన్ చెప్పిన వాగ్దానాలపట్ల మరింతగా ప్రజలను నమ్మించేందుకు వై వి సుబ్బారెడ్డి లాంటి నాయకులు తమ వంతు కృషి చేశారు. సెప్టెంబర్ లో రాజధాని వచ్చేయబోతున్నదంటూ ఊదరగొడుతున్నారు. కానీ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడయ్యే వరకు ప్రాక్టికల్ గా అది సాధ్యమయ్యే సంగతి కాదనేది అందరికీ తెలిసిన సంగతి. ఈ నేపథ్యంలోనే స్వయంగా తాను మళ్ళీ మరొక ప్రకటన చేస్తే ప్రజల్లో చులకన అవుతాననే భయంతో జగన్మోహన్ రెడ్డి తాను మాట్లాడకుండా మంత్రి గుడివాడ అమర్నాధ్ ని వాడుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన ద్వారా ప్రకటన చేయించారని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజధాని తరలింపు అనేది సాధ్యం కాదుగనుక దసరా అనే మాట వాడారు అనేది పలువురి అంచనా!
గుడివాడ అమర్నాథ్ కూడా చాలా టెక్నికల్ గా మాట్లాడుతూ శుభవార్త వస్తుందని మాత్రమే అన్నారు. ముఖ్యమంత్రి కూడా తాను కాపురం విశాఖపట్నం మారుస్తానని మాత్రమే అన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా నివాసం ఉంటూ పరిపాలన సాగించవచ్చు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటూ నెలల తరబడి పాలన సాగించిన వైనం కూడా అందరికీ తెలుసు. జగన్ కాపురం మార్చినంత మాత్రాన రాజధాని మార్చినట్లు కాదు. రాజధాని మార్పు అనేది న్యాయపరమైన వివాదం. సుప్రీంకోర్టు తీర్పుతో తప్ప తేలే సంగతి కాదు. అప్పటిదాకా మహా అయితే ఇలాంటి వాయిదా మాటలతో ప్రజలను మభ్య పెట్టగలరు తప్ప, రాజధానిని తీసుకువెళ్లలేరు అని పలువురు అంచనా వేస్తున్నారు.