ఈసారి.. జగన్ ప్రత్యేకహోదా తెస్తారా?

Sunday, December 22, 2024

వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 25 లోక్ సభ సీట్లు దక్కుతాయని సర్వేలు చెబుతున్నాయంటూ.. ఆ పార్టీ పార్లమెంటరీ పక్ష నాయకుడు విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. తమ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని అన్నారు. ప్రస్తుతం 25లో మూడు ఎంపీ సీట్లు తెలుగుదేశం ఖాతాలో ఉన్నాయి. ఆ మూడింటిని కూడా తామే దక్కించుకోబోతున్నట్టుగా విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే నూటికి నూరుశాతం ఎంపీ సీట్లను దక్కించుకుంటాం అని మురిసిపోవడం కాదు.. అదే జరిగితే గనుక.. తమ మీద పెరిగే బాధ్యత గురించి విజయసాయి గుర్తు పెట్టుకోవాలి. పాతిక మంది ఎంపీలను ఇస్తే గనుక.. కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించుకువస్తానని చెప్పిన ప్రగల్భాలను విజయసాయిరెడ్డి గుర్తుచేసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి పరంగా అద్భుతమైన వరం అని ప్రజలందరూ భావించిన ప్రత్యేకహోదా విషయంలో అన్ని పార్టీలు కూడా ప్రజలను మోసం చేస్తూ వచ్చాయి. అందరూ చేసిన మోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి మోసం మరీ చోద్యం. మేం త్యాగాలు చేసేస్తున్నాం అంటూ.. ఎంపీ పదవులు కోల్పోయే అవకాశం లేనంత దూరంలో ఆ పార్టీ వారు రాజీనామాలు చేశారు. అది కూడా రాజ్యసభ ఎంపీలు మాత్రం పదవుల్ని అట్టిపెట్టుకుని కూర్చున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రమంతా సమ్మెలు, బంద్ లతో ప్రత్యేకహోదా కోసం హోరెత్తించారు. ప్రభుత్వాన్ని నిందించారు. తమ ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తాం అని ప్రగల్భాలు పలికారు. ఆ పార్టీ మాటలు నమ్మి ప్రజలు ఏకంగా 22 ఎంపీ సీట్లు వారి చేతిలో పెడితే.. ఆ తర్వాత చేతగానివాళ్లలాగా సైలెంట్ గా ఉండిపోయారు.

ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడెల్లా.. ప్రత్యేకహోదా ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం.. అంటూ ఒక అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు ప్లే చేయడం తప్ప సాధిస్తున్నది ఏం లేదు.

ఇప్పుడు విజయసాయిరెడ్డి ప్రజలు తమ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారని.. వచ్చే ఎన్నికల్లో తమకు 25 సీట్లు దక్కుతాయని అంటున్నారు. అలాంటి నేపథ్యంలో వారికి అంత నమ్మకం ఉంటే గనుక.. ఈసారి తాము ప్రత్యేకహోదా సాధించుకు వస్తాం అని గట్టిగా చెప్పగల ధైర్యం ఉందా అనేది ప్రజల ప్రశ్న. హోదా దక్కకపోతే గనుక.. తమ పార్టీ ఎమ్మెల్యేలతో ప్రతి ఆరునెలలకు ఒకసారి రాజీనామా చేయిస్తూ.. దేశంలో ఒక సంచలనాన్ని నమోదు చేయగలిగే ధైర్యం ఆ పార్టీకి ఉందా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎన్ని ఎంపీసీట్లు గెలుస్తామో ప్రగల్భాలు ముఖ్యం కాదని.. ప్రత్యేకహోదా తేవాలనే చిత్తశుద్ధి ముఖ్యమని అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles