To err is human అంటారు పెద్దలు. తప్పు చేయడం మానవ సహజం. అయితే చేసిన తప్పును ఎంత త్వరగా గుర్తిస్తున్నాం, ఎంత త్వరగా అంగీకరిస్తున్నాం, ఎంత త్వరగా దిద్దుకుంటున్నాం.. అనే విషయాల మీదనే ఒక వ్యక్తి యొక్క కేరక్టర్ ఆధారపడి ఉంటుంది. తప్పును ఒప్పుకోవడం అనేది సంస్కారానికి నిదర్శనంగా నిలుస్తుంది. అయితే పొద్దున లేస్తే.. యావత్ ప్రజలకు ఉపదేశాలు చేస్తూ బతికే పత్రికల విషయంలో.. ఇలా సంస్కారాన్ని పాటించే వారెవరు? అనే మీమాంస ఇప్పుడు తలెత్తుతోంది.
ఒక తప్పు జరిగినప్పుడు- దాన్ని ఒప్పుకోవడం, లెంపలు వేసుకోవడం అవమానం ఎంతమాత్రమూ కాదు. తెలుగులో అగ్రశ్రేణి దినపత్రిక ఈనాడు ఆ పనిచేసింది. మరి అదే తరహా తప్పు ఇప్పుడు సాక్షి చేసింది. వారు లెంపలు వేసుకుంటారా.. లేదా, తమకు ఉన్న సంస్కారం ఇంతేనని సరిపెట్టుకోమని డబాయించి బతికేస్తారా అనే చర్చ ప్రజల్లో నడుస్తోంది.
తాజాగా, జీవో నెం1 మీద చర్చ సందర్భంగా శాసనసభలో చాలా పెద్ద రాద్ధాంతం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. స్పీకరు పోడియం లోకి వెళ్లిన తెలుగుదేశం ఎమ్మెల్యేలపై , వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేయడం, తోపులాటల వారికి కూడా దెబ్బ తగలడం వంటి అవాంఛనీయ సంఘటనలు జరిగాయి.
అయితే ఈ సంఘటన కవరేజీ విషయంలో సాక్షి దినపత్రిక ఒక పొరబాటు చేసింది. స్పీకరుపై వికృతచేష్టలు, అసెంబ్లీకి బ్లాక్ డే అంటూ సాక్షిలో ఒక బ్యానర్ కథనం ప్రచురించారు. అసలు సంఘటన జరిగిన క్రమంలో.. తెలుగుదేశాన్ని తప్పుపట్టడానికి తగినంత రంజైన ఫోటో వారికి దొరకలేదో ఏమో గానీ.. స్పీకరు మీదకు కాగితాలు విసురుతున్న పాత ఫోటోను వాడారు. ఆ ఫోటో చూపించి బోలెడు నిందలు వేశారు. అయితే ఆ ఫోటోలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని.. సంఘటన జరిగిన రోజున అసలు అసెంబ్లీకే రాకపోవడం విశేషం. సభకు గైర్హాజరైన భవాని ఫోటో పేపర్లో చూసుకుని టీడీపీ వారే నివ్వెరపోయారు. సంగతేంటంటే.. ముందురోజు సాక్షి పేపర్లో కూడా అదే ఫోటోను వాడారు. అంటే కేవలం టీడీపీ మీద నింద వేయడానికే పాత ఫోటోను వాడారని అర్థమైపోతోంది.
ఇదే తరహా పొరబాటు ఈనాడులో కూడా ఇటీవల జరిగింది. టీడీపీ నేత పట్టాభిని పోలీసులు కోర్టుకు తీసుకువచ్చినప్పుడు ఆయన తనను పోలీసులు కొట్టారని, చేతులు వాచిపోయాయని చేతులు చూపించారు. అయితే ఈనాడు దినపత్రికలో ఆయనను కొట్టినట్టుగా వాచిపోయిన కాళ్ల ఫోటోలు కూడా వేశారు. తర్వాత ఆ ఫోటోలు పాత ఫోటోలు అని తేలింది. ఈనాడు దినపత్రిక రెండో రోజున తాము పొరబాటు చేసినట్టుగా లెంపలు వేసుకుంది. ఆ తప్పుకు బాధ్యులుగా నిర్ణయించి నలుగురు జర్నలిస్టులను ఉద్యోగంలోంచి పీకేసింది. ఆ రకంగా తప్పు ఒప్పుకునే సంస్కారం తమకు ఉన్నదని నిరూపించుకుంది.
మరి ఇవాళ తప్పుడు ఫోటో ప్రచురించి తెలుగుదేశంపై నిందలు వేసిన సాక్షి దినపత్రిక.. తమ తప్పు ఒప్పుకుని సంస్కారం ఉన్నదని చాటుకుంటుందా లేదా చూడాలి.
ఈనాడుకు ఉన్న సంస్కారం సాక్షికి ఉంటుందా?
Monday, December 23, 2024