ప్రభుత్వం నిర్మించి ఇచ్చే ఇళ్ల కోసం నిరుపేదలు మాత్రమే దరఖాస్తు చేసుకుంటారు. పాలకుల దయవలన తమకు ఒక శాశ్వతమైన స్థిర నివాసం ఏర్పడుతుందని నిరుపేదలు ఆశలు పెంచుకుంటారు! అయితే వారి ఆశలపై నీళ్లు చిలకరించి.. రేపో మాపో దక్కుతాయని ఎదురుచూస్తున్న ఇళ్లను కొన్ని సంవత్సరాలుగా వారికి ఇవ్వకుండా, పట్టించుకోకుండా కొత్త ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటే ఆ నిరుపేదలు ఏం చేయగలరు? త్వరలోనే సొంత ఇల్లు ఏర్పడుతుందనుకున్న వారి కలలను చిదిమేసినందుకు ఆ ఉసురు ప్రభుత్వానికి తగలకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే పరిస్థితి కనిపిస్తోంది.
చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇదే అంశాన్ని లేవనెత్తుతూ ప్రభుత్వ వైఫల్యాన్ని, దుర్మార్గాన్ని ప్రజల దృష్టికి తీసుకెళుతున్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో కొన్ని లక్షల టిడ్కో ఇళ్లు నిర్మించగా.. జగన్ సర్కారు వచ్చిన తర్వాత వాటిని లబ్ధిదారులకు కేటాయించకుండా మోసం చేశారని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. ఈ నాలుగేళ్లుగా కనీసం వాటి గురించి పట్టించుకోకపోవడం వలన అవన్నీ శిధిల గృహాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల వద్ద చంద్రబాబు సెల్ఫీ దిగి జగన్ కు సవాలు విసిరారు.
టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగి ‘‘మేం లక్షల ఇళ్ళు నిర్మించాం.. నువ్వు ఏం నిర్మించావు’’ అంటూ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరిన చంద్రబాబు నాయుడు.. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ ఇలాంటి ఛాలెంజ్లతో ముందుకు రావాలని అంటున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనుల వద్ద కార్యకర్తలు సెల్ఫీలు దిగి.. ప్రభుత్వాన్ని ట్యాగ్ చేస్తూ సవాలు విసరాలని ఆయన పిలుపునిస్తున్నారు. దీనివలన రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో చిన్నా పెద్ద అభివృద్ధి పనులు అన్నీ కూడా ప్రభుత్వానికి చాలెంజ్ రూపంలో సోషల్ మీడియాలోకి వెల్లువెత్తే అవకాశం ఉంటుంది. ఈ ఛాలెంజ్ కి జవాబు చెప్పడం కూడా ప్రభుత్వానికి అవమానకరంగా అనిపిస్తుంది. అలాగని జవాబు చెప్పకపోతే గనుక.. సోషల్ మీడియా నిండుగా టిడిపి వారు చేస్తున్న చాలెంజ్ లు యువతరాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు సరికొత్త సెల్ఫీ చాలెంజ్ వ్యూహం అధికార పార్టీని ఇరుకునపెట్టే అవకాశం కనిపిస్తుంది.
ఇదివరకే, పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ సెల్ఫీ చాలెంజ్ లతో జగన్ ను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జవాబు చెప్పలేని పరిస్థితికి నెట్టేసిన సంగతి తెలిసిందే. తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో కలిసి దిగిన సెల్పీలు, కియా కార్ల పరిశ్రమ వద్ద దిగిన సెల్ఫీలతో నారా లోకేష్ ప్రభుత్వానికి సవాళ్లు విసిరారు. బుకాయింపు, డబాయింపు ప్రకటనలు తప్ప ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇవి ప్రజలను ఆలోచింపజేశాయి. ఇదే సెల్ఫీవ్యూహాన్ని ఇప్పుడు తెలుగుదేశం అధినేత రాష్ట్రవ్యాప్తం చేసేస్తున్నారు.