రాజకీయ నాయకులు ఏ రోటి కాడ ఆ పాట పాడడం చాలా సాధారణమైన విషయం. అదే రీతిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఉత్తరాంధ్ర పర్యటనలో అక్కడి ప్రజలకు రుచిస్తుందనే భ్రమలో.. సెప్టెంబరులో తాను కాపురం విశాఖపట్నానికి మార్చేస్తానని అన్నారు. అధికార వింకేంద్రీకరణలో భాగంగానే అది జరుగుతుందని అన్నారు. ఆయన చాలా టెక్నికల్ గా ఆ మాట వాడారే తప్ప, సెక్రటేరియేట్ కూడా వచ్చేస్తుందని అనలేదు!
అయితే స్వామిని మించిన స్వామిభక్తి ప్రదర్శించడం బాగా అలవాటు అయిన ఆయన వందిమాగధులు మాత్రం రెచ్చిపోతున్నారు. విశాఖకు రాజధాని వచ్చేసినట్టే అన్నట్టుగా మాటలు వల్లిస్తున్నారు.
మంత్రి గుడివాడ అమర్నాధ్ మాట్లాడుతూ ‘‘జగన్ విశాఖకు రాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు’’ అని ఘాటుగా చెబుతున్నారు. అసలు ఆయనను అడ్డుకోవడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? అడ్డుకుంటామని ఎవరు అంటున్నారు? ఆయన ఎందుకంత రెచ్చిపోయి ‘అడ్డుకోలేరు’ అంటున్నారో తెలియదు. జగన్ తన కాపురం రాష్ట్రంలో ఎక్కడికైనా మార్చుకోవచ్చు. అన్యాపదేశంగా ఈ మాట ద్వారా.. గుడివాడ అమర్నాధ్, న్యాయవ్యవస్థ తమ జగన్ ను ఏమీ చేయలేదు – అని ధిక్కరిస్తున్నారా? అనే అనుమానం కొందరికి కలుగుతోంది.
సెప్టెంబరు నుంచి వ్యవస్థలన్నీ కూడా విశాఖ నుంచే పరిపాలన సాగిస్తాయి.. అని గుడివాడ అమర్నాధ్, ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేని క్లారిటీ ఆయనను మించిన ప్రభుత్వాధినేతలాగా తానే ఇచ్చేస్తున్నారు. అయితే ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కారం అవుతుంది.
విశాఖ వాసులను నమ్మించడానికి, రాజధాని వచ్చేస్తున్నది అని ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికి ఇలా మాట్లాడుతున్నట్టుంది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాల్సిన ఎంతో ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని అనే తాయిలం ఆ ప్రాంతంపై పనిచేయడం లేదు. ఆ మాటలు ఎంతగా వల్లించినా పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో దక్కిన పరాజయం అందుకు నిదర్శనం. ఆ సంగతి తెలుసుకోకుండా.. ఉత్తరాంధ్ర మనసు గెలుచుకోవడానికి ప్రత్యామ్నాయాలు చూసుకోకుండా.. రాజధాని మాయ మాటలు చెబుతున్నంత వరకు వారికి పెద్ద ప్రయోజనముండదు! పైగా జగన్ ను మించి అతి వాగ్దానాలు చేస్తుంటే, ఆయన పరువే పోతుంది.
ఇలాంటి ఎగస్ట్రాలే జగన్ పరువు తీసేది!
Saturday, January 18, 2025