రాష్ట్రంలో రాజకీయం అధికార పార్టీకి, విపక్షాలకు మధ్య మొదలైన యుద్ధంలాగా కనిపించడం లేదు. కాపు సామాజిక వర్గంలోనే ఒక వర్గం ఇంకొక వర్గంతో తగాదా పడుతున్నట్టుగా ఉంది. అసలు విమర్శలు, అసలు అవసరమైన విషయాలు గాడితప్పుతున్నాయా అనే అనుమానం కూడా కలుగుతోంది.
పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో భాగంగా.. కాకినాడ సర్పవరం జంక్షన్ నుంచి చేసిన ప్రసంగంలో స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అరాచకాల గురించి ఓ రేంజిలో ఆడుకున్నారు. ద్వారంపూడి తాతను అప్పట్లో డీటీ నాయక్ బేడీలు వేసి వీధుల్లో తీసుకువెళ్లినట్టుగా, భీమ్లానాయక్ ట్రీట్మెంట్ ఇచ్చి బేడీలు వేయించి నడిపిస్తూ తీసుకువెళ్తానని హెచ్చరించారు పవన్ కల్యాణ్. దానికి జవాబుగా ద్వారంపూడి ప్రెస్ మీట్ పెట్టి మరీ.. పవన్ కల్యాణ్ కు దమ్ముంటే తనమీద పోటీచేయాలని సవాలు విసిరారు. ఈ యుద్ధం ఇలా నడుస్తుండగా.. మధ్యలో ఈ ఇరువురి నడుమన వృద్ధ సేనానులు రంగ ప్రవేశం చేశారు.
వ్యవహారం పవన్ కల్యాణ్ కు – ద్వారంపూడికి మాత్రమే సంబంధించినది కాగా.. మధ్యలో ముద్రగడ ఎందుకు దూరారో తెలియదుగానీ.. చాలా తీవ్రంగా రంగప్రవేశం చేశారు. పవన్ కల్యాణ్ ను ఆయన రకరకాలుగా ఎద్దేవా చేశారు. కాపుజాతిని ఉద్ధరించడం కోసం మాత్రమే తాను పుట్టినట్టుగా అతిశయంగా వ్యవహరిస్తూ ఉండే ముద్రగడ పద్మనాభం.. ఈ వ్యవహారంలో మాత్రం.. ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని, ఆయన తండ్రిని, తాతను కూడా వెనకేసుకు వచ్చారు.
ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగియలేదు. పవన్ కు మద్దతుగా తెలుగుదేశం పార్టీ నాయకుడు బుద్ధా వెంకన్న అనూహ్యంగా బరిలోకి దిగి, ముద్రగడ పద్మనాభం క్రెడిబిలిటీని ప్రశ్నిస్తూ సూటిగా మరో లేఖాస్త్రం కూడా సంధించారు. ఆ విషయం పక్కన పెడితే.. ముద్రగడ పద్మనాభం ను దీటుగా ప్రశ్నించగల వృద్ధ సేనానిగా.. పవన్ కల్యాణ్ తరఫున హరిరామజోగయ్య రంగంలోకి వచ్చారు. ఆయన ముద్రగడ వైఖరిని నిందించారు.
ఇరుపక్షాల తరఫున వృద్ధ సేనానులు రంగంలోకి దిగిన ఈ వ్యవహారంలో.. ముద్రగడ వైఖరే అనుమానాస్పదంగా ఉంది. హరిరామజోగయ్య తొలినుంచి కూడా పవన్ కల్యాణ్ జట్టులోని నాయకుడే. ఇవాళ కొత్తగా పవన్ కు అనుకూలంగా మాట్లాడితే అనుమానించాల్సింది ఏమీ లేదు. అదే, ముద్రగడ పద్మనాభం జగన్ కోటరీలోని వ్యక్తి కాదు. ఆయన వ్యవహారం అలాగే కనిపిస్తుంది గానీ.. తాను స్వతంత్రంగా వ్యవహరించే వాడినని చెప్పుకుంటూ ఉంటారు. అంతటి స్వతంత్రుడు పిలవని పేరంటంలాగా రంగంలోకి వచ్చి.. ద్వారంపూడి రెడ్డి గారి కోసం పవన్ మీద ఎందుకలా నోరు పారేసుకున్నారనేది ప్రశ్న. ముద్రగడ పద్మనాభం, ద్వారంపూడికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోవడం వల్లనే ఈ లేఖ రాశారనే విమర్శలు కూడా వస్తున్నాయి. మొత్తానికి రాజకీయం పార్టీల మద్య కాకుండా, ఒకే సామాజికవర్గంలో ఉండే వేర్వేరు గ్రూపుల మధ్య పోరుగా తయారైంది.