ఇది కేసీఆర్‌కు మింగుడుపడడం కష్టం!

Wednesday, January 22, 2025

టిక్కెట్ ఇచ్చినా కూడా తన నాయకత్వాన్ని గానీ, తన పార్టీని గానీ ఖాతరు చేయకుండా మాట్లాడే వాళ్లను కేసీఆర్ బహుశా తన రాజకీయ జీవితంలో చూసి ఉండరు. తన పార్టీకి చెందిన సిటింగ్ ఎమ్మెల్యేకు మళ్లీ టికెట్ ఇచ్చినా కూడా సంతృప్తి చెందకుండా.. నేను ఏ పార్టీనీ విమర్శించను. పార్టీలకు అతీతంగా ఉంటా.. అంటూ మెత్తటి తిరుగుబాటు చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోవచ్చు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపాటి హనుమంతరావు.. గులాబీబాస్ కేసీఆర్ కు ఇలాంటి భిన్నమైన అనుభవాలను రుచిచూపిస్తున్నారు.

మైనంపాటి హనుమంతరావు తన కొడుకు మైనంపాటి రోహిత్ కు మెదక్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. అక్కడ భారాస సిటింగ్ ఎమ్మెల్యేగా పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నారు. సిటింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి టికెట్ ఇవ్వడం అంటే.. అవినీతి ఆరోపణలు, ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్ప కష్టం. కానీ, తన కొడుకు కరోనా సీజనులో అక్కడ విపరీతంగా సేవా కార్యక్రమాలు చేశాడని, అందుకే టికెట్ కావాల్సిందేనని మైనంపల్లి పట్టుబట్టారు. తన కొడుకుకు టికెట్ దక్కకుండా అడ్డు పడుతున్నారనే భావనతో హరీష్ రావు మీద కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. ఇదంతా సోమవారం నాడే జరిగినప్పటికీ.. పార్టీ యథావిధిగా ఆయనకు టికెట్ ప్రకటించింది. అప్పటికే తిరుగుబాటు ధోరణి చూపించినా.. పట్టించుకోకుండా టికెట్ ఇచ్చారు. కానీ ఒకరోజు తర్వాత కూడా మైనంపల్లి హన్మంతరావు శాంతించినట్లు లేదు. తండ్రీ కొడుకులు ఇద్దరికీ టికెట్ కావాల్సిందేనంటున్నారు. ‘తనకు మల్కాజిగిరితో పాటు తనకు మారుడు రోహిత్ కు మెదక్ టికెట్ ఇస్తేనే భారాస తరఫున పోటీచేస్తానని.. లేకుంటే ఇద్దరమూ స్వతంత్రంగా బరిలోకి దిగుతామని’ ప్రకటించిన ఆయన అవసరమొస్తే సిద్ధిపేటలో హరీష్ రావు మీదనైనా పోటీచేసి ఓడిస్తానని హెచ్చరించడం విశేషం. హరీష్ రావుపై వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీ నాయకులు ఆయనపై ఆగ్రహిస్తున్నారు. అయినా సరే.. మైనంపల్లి ఖాతరు చేయకుండా.. తన తిరుగుబాటు వైఖరిని ఇంకా కొనసాగిస్తుండడం కేసీఆర్ కు మింగుడుపడే వ్యవహారం కాదు. ఈ నేపథ్యంలో.. ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారు. పార్టీ టికెట్ ఇచ్చినా కూడా.. తన ధోరణిలోనే మాట్లాడుతున్న మైనంపల్లిని పార్టీనుంచి బయటకు పంపుతారా? అనేది కీలకమైన చర్చనీయాంశంగా మారుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles