‘అవ్వా /తాతా / వికలాంగుడా లేదా వితంతువు అయిన అక్కా..
నీకు ఈ పింఛనును మన జగనన్న ఎంతో దయతో ఇచ్చుచున్నాడు. ఈ సంగతి నీకు తెలుసునా.. తెలుసుకొనవలెను! జగనన్న కరుణామయుడు గనుక నీ పింఛనును మూడువేలకు పెంచుచున్నాడు. ప్రస్తుతం 2750 వరకు పెంచియున్నాడు. నీవు దుర్భర దారిద్ర్యములో, గతిలేని స్థితిలో ఉంటివి గనుక.. జగనన్న దయయుంచి ఈ పింఛను ఇచ్చుచున్నాడు. ఈ రకముగా నీవు జగనన్నకు రుణపడి ఉండెదవని తెలుసుకొనవలెను. జగనన్న రుణమును తీర్చుకొనుటకు యత్నించవలెను. ఎన్నికలు వచ్చినప్పుడు జగనన్నకే ఓటు వేయవలెను. అట్లు నీవు వేయనిచో.. నీకు వచ్చు ఈ పింఛను ఇక మీదట రాదు. నీ జీవితము మరింత దారిద్ర్యములోనికి కుంగిపోవును. కనుక, జాగరూకతతో మెలగి, జ్ఞాపకమునందు జగనన్నను నిత్యమూ ఉంచుకుని.. పింఛను ఆయన దయయని ఎరిగి మెలగవలెను’
ఇటువంటి స్క్రిప్టు ఒకటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే సిద్ధంచేశారో లేదో తెలియదు. కానీ కొత్త సంవత్సరం మొదలు కాగానే రాష్ట్రంలో కొత్త పర్వం మొదలు కానుంది. లబ్ధిదారులకు ఇచ్చే ప్రతి పెన్షనుతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భజన చెప్పనున్నారు. వాలంటీర్లు చెప్పే ప్రవర చాలడం లేదని, అదనంగా ప్రతి సచివాలయం పరిధిలోకి ఇద్దరు గృహసారథులను కూడా నియమించారు. ఇంటింటికీ వాలంటీరు పెన్షను అందించే సమయంలో పార్టీ తరఫున పనిచేసే గృహసారథులు కూడా ఉండాలిట. వారి సమక్షంలోనే పెన్షన్ల పంపిణీ జరగాలని కొత్త అనధికారిక ఉత్తర్వులు కిందిస్థాయి వరకు వెళ్లాయి. లబ్ధిదారులకు పెన్షను ఇవ్వగానే.. అది జగనన్న పుణ్యమా అని వస్తున్నదంటూ.. పొందిన వారిలో భక్తిని పెంపొందించడానికి ఈ గృహసారథులు తమ వంతు ప్రయత్నం చేస్తారన్నమాట.
లబ్ధిదారులకు పింఛను అనేది జగన్మోహన్ రెడ్డి కొత్తగా కనిపెట్టిన, ప్రారంభించిన అమ్మఒడి పథకం కాదు. కొన్ని దశాబ్దాలనుంచి అమల్లో ఉన్న సంక్షేమ పథకమే. ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ.. కొద్దికొద్దిగా ఆ పెన్షను మొత్తాన్ని పెంచుకుంటూ వస్తున్నాయి. లబ్ధిదారులకు ఎంతో కొంత ఆసరాగా ఉండగల ఆశయంతో ఏర్పాటుచేసిన పింఛను పథకం.. నెమ్మదిగా ఓటుబ్యాంకు రాజకీయాల పుణ్యమాని వారి సాధారణస్థాయి జీవనానికి సరిపడా స్థాయికి చేరుకుంది. చంద్రబాబునాయుడు పరిపాలన కాలంలో ఒక్కొక్కరికి రెండువేల రూపాయల పింఛను ఇచ్చేవారు. దానికి పోటీగా మూడువేలు చేస్తానని ప్రకటించిన జగన్.. ఏటేటా 250 పెంచుతూ.. ఎన్నికల నాటికి మాట నిలబెట్టుకున్నాననే డప్పు కొట్టడానికి వీలుగా చేస్తున్నారు. అయితే.. ఈ పింఛను మొత్తం తన జేబులోంచి ఇస్తున్న స్థాయిలో లబ్ధిదారులలో తన పట్ల ఆరాధాన భావం పెంచడానికి ఆయన పార్టీ గృహసారథుల సేవలను వాడుకోవాలనుకుంటున్నారు. అందుకే వారి సమక్షంలో మాత్రమే పెన్షన్లు ఇవ్వాలని నాయకులు వాలంటీర్లకు సూచిస్తున్నారు. అలా ఇచ్చిన తర్వాత.. లబ్ధిదారుల బుర్రల్లో జగన్ భక్తిని చొప్పించే ప్రయత్నం గృహసారథులు తీసుకుంటారన్నమాట. కాకపోతే.. ఇన్నాళ్లూ పింఛను ఇచ్చే వాలంటీరుకు మాత్రమే లబ్ధిదారులు లంచం ఇస్తుండేవాళ్లు.. ఇప్పుడు పార్టీ గృహసారథులు కూడా లంచం కాకపోయినా.. ఏదో ఒక ప్రతిఫలం ఆశిస్తూఉంటారేమో లబ్ధిదారులతో ఆడుకుంటారేమో మరి!
ఇక పింఛనుతో పాటు ఇంటింటికీ జగన్ భజన!
Thursday, November 14, 2024