ఇక టాప్‌గేర్‌లో బాబాయి పొలిటికల్ యాక్టివిటీ!

Wednesday, January 22, 2025

జగన్మోహన్ రెడ్డి బాబాయి వైవీసుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా పదవీకాలం మరో మూడువారాల్లో ముగిసిపోతుంది. ఇప్పటికే ఆయన ఉత్తరాంధ్ర జిల్లాలకు పార్టీ ఇన్చార్జిగా సేవలందిస్తున్నారు. టీటీడీ బాధ్యతల్లో ఉంటూనే.. పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడెల్లో విశాఖతోపాటు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తూ, పార్టీ నాయకులను సమన్వయపరుస్తూ ముందుకు సాగుతున్నారు. ఈసారి ఎన్నికల్లో బరిలోకి దిగే ఉద్దేశంతోనే వైవీ ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లు రెండు  పడవల మీద ప్రయాణం లాగా రాజకీయం చేస్తూ వచ్చిన వైవీ.. ఇప్పుడిక పూర్తిస్థాయిలో పార్టీ పని మీదనే దృష్టి పెడతారు. ఆయన రాజకీయ కార్యకలాపాలు టాప్ గేర్ లో సాగుతాయని పార్టీ వారు చెబుతున్నారు.

జగన్ బాబాయి.. అడపాదడపా పార్టీ మీద దృష్టి పెడితేనే.. కొన్నిచోట్ల అల్లకల్లోలం జరుగుతోంది. ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ ఇన్చార్జి అయినప్పటికీ.. తన సొంత జిల్లా ఒంగోలు రాజకీయాలను కెలకకుండా ఉండడం లేదు. ఆయన దెబ్బకు అల్లుడు అయ్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఏకంగా రాజకీయాల మీదే విరక్తి పెంచుకునే పరిస్థితి ఏర్పడినట్టుగా చెబుతున్నారు. పార్టీ ప్రాంతీయ ఇన్చార్జి పదవికి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయడం వెనుక కూడా.. వైవీ దెబ్బ వలన ఏర్పడిన అలక కారణం అని అందరికీ తెలిసిందే.

వైవీ సుబ్బారెడ్డి తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన ఒంగోలు స్థానం నుంచే మళ్లీ ఎంపీగా బరిలో ఉండాలని ఆశిస్తారా? లేదా, తమ ప్రభుత్వం మళ్లీ ఏర్పడుతుందనే నమ్మకంతో ఎమ్మెల్యేగా రంగంలోకి దిగుతారా? అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఒకవేళ వైవీ సుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా బరిలోకి దిగి నెగ్గితే.. పార్టీలో మరో పెద్ద అంతర్గత పోరు షురూ అవుతుంది. ఒంగోలు జిల్లానుంచి మంత్రి పదవుల పంపకంలో.. బాబాయికి, మామయ్యకు మధ్య జగన్ నలిగిపోవాల్సి వస్తుంది. అసలే వైవీ- బాలినేని మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉంది. ఆయన ఎమ్మెల్యే అయితే.. అది మరింత పెరిగి పార్టీకే నష్టంచేస్తుంది కూడా.

ఆయన ఉత్తరాంధ్ర ఇన్చార్జి అయినప్పటికీ.. విశాఖ ఎంపీ సీటు మీద విజయసాయిరెడ్డి కన్నేసి, అక్కడి సిటింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. వైవీ విశాఖను ఆశించకపోవచ్చు. తనకు సేఫ్ గేమ్ ఉండాలంటే.. ఒంగోలును ఆయన కోరుకుంటే గనుక.. సిటింగ్ ఎంపీ  మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఏంచేస్తారో తెలియదు.

ఇన్ని రకాల కాంబినేషన్ల మధ్య వైవీ సుబ్బారెడ్డి తన టీటీడీ పదవి ముగియగానే టాప్ గేర్ లో రాజకీయం చేయబోతున్నారు. పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles