తెలుగుదేశాన్ని దెబ్బకొట్టడం ఒక్కటే లక్ష్యంగా, ఆ పార్టీ నుంచి అడ్డగోలుగా వలసలను ప్రోత్సహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందుకు మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం వచ్చింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. వలస నాయకులు ఉన్నచోట పార్టీ గడ్డు పరిస్థితులను, ముఠా తగాదాలను ఎదుర్కొంటోంది. ప్రధానంగా గన్నవరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీచేసిన యార్లగడ్డ వెంకటరావు.. పార్టీ మీద తిరుగుబాటు బావుటా ఎగరవేసి తెలుగుదేశంలో చేరిపోయారు. గన్నవరం నియోజకవర్గాన్ని భారీ మెజారిటీతో గెలిచి చంద్రబాబునాయుడుకు కానుకగా అందిస్తానని యార్లగడ్డ ప్రతిజ్ఞ చేశారు.
ఇదే నియోజకవర్గంలో డాక్టర్ దుట్టా రామచంద్రరావు కూడా వైసీపీకి కీలక నాయకుల్లో ఒకరు. వల్లభనేని వంశీని వైసీపీలోకి తీసుకున్న తర్వాత.. ఆయన కూడా అసంతృప్తిగానే ఉన్నారు. ఇన్నాళ్లుగా తమ పార్టీ నాయకులకు వేరే గతిలేదని, తాము ఏం చేసినా సరే వారు పార్టీలోనే పడి ఉంటారని వైసీపీ అధిష్ఠానం భావిస్తూ వచ్చింది. యార్లగడ్డ తెలుగుదేశంలో చేరిన తర్వాత వారి పోకడ మారింది. దుట్టా రామచంద్రరావు మద్దతు కూడా యార్లగడ్డ వెంకటరావుకే ఉంటుందనే పుకార్లు వ్యాపిస్తున్న తరుణంలో.. నష్ట నివారణకు వారు రంగంలోకి దిగారు. ఎంపీ బాలశౌరిని దుట్టాతో రాయబారానికి పంపారు.
అయితే తమాషా ఏంటంటే.. దుట్టా రామచంద్రరావుతో బాలశౌరి భేటీ తర్వాత ఈ ఇద్దరు నాయకులు కలిసే మీడియాతో మాట్లాడారు. అయితే బాలశౌరి మాటలు, దుట్టా మాటలు వేర్వేరుగా ఉండడం గమనార్హం.
దుట్టా రామచంద్రరావు ఈ జిల్లాలోనే వైసీపీ పార్టీకి మొదటి సభ్యుడని, ఆయన జగన్ విజయానికి తన శక్తివంచన లేకుండా పాటుపడతారని, గతంలో కూడా తను చేయగలిగినదాంతా చేశారని, గన్నవరంలో వైసీపీని గెలిపిస్తారని బాలశౌరి చెప్పారు. నిజంగానే దుట్టా రామచంద్రరావు పార్టీకి అంతటి కీలకమైన, సేవచేసిన నాయకుడని పార్టీ నమ్ముతూ ఉంటే గనుక.. ఆయనకే పార్టీ టికెట్ ఇవ్వవచ్చు కదా.. అవకాశవాద వలస నేతలను ప్రోత్సహించడం ఎందుకు? అనేది దుట్టా వర్గం ప్రశ్న!
అదే సమయంలో దుట్టా రామచంద్రరావు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితుల గురించి మాట్లాడడానికి ముఖ్యమంత్రి జగన్ తనను మూడు నెలల కిందట పిలిపించారని, అప్పుడే ఆయనకు నిర్మొగమాటంగా.. పార్టీ స్థితిగతులను ఉన్నదున్నట్టుగా చెప్పానని మాత్రమే అన్నారు. ఇప్పడు బాలశౌరికి కూడా అవే విషయాలను చెప్పానని అన్నారు. అంతే తప్ప.. జగన్ కు జై కొట్టలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని గెలిపిస్తానని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పడికట్టు మాటలు వాడలేదు. ఈ మాటలు గమనించిన ఎవ్వరికైనా సరే.. బాలశౌరి దౌత్యం అంత ఫలవంతంగా సాగలేదని అర్థమవుతుంది.
అందుకే.. అసలు దుట్టా బాలశౌరి బుట్టలో పడ్డారా? లేదా? అనే మీమాంస ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.