‘ఇండియా’ను కాంగ్రెస్ హైజాక్ చేసేస్తోందా?

Friday, November 22, 2024

ముంబాయిలో మూడోసారి సమావేశం  కాబోతున్న ఇం.డి.యా. కూటమి.. ఈ భేటీలో సీట్ల సర్దుబాటు గురించి నిర్ణయాలు తీసుకోకపోయినప్పటికీ.. కూటమి యొక్క జెండా, కూటమి యొక్క గుర్తులను ఫైనలైజ్ చేస్తుందని ఆ పార్టీ నాయకుల ద్వారా తెలుస్తోంది. నిజానికి పార్టీలకు జెండాలు ఉంటాయి. అయితే.. సుమారుగా 28 పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకుంటున్న కూటమికి కూడా ఒక జెండా ఉంటుందా? అనేది ప్రజలకు కలుగుతున్న  సందేహం. గతంలో కూడా భాజపాయేతర పార్టీలతో యూపీఏ కూటమి చెలామణీలో ఉండేది. రెండు దఫాలు కేంద్రంలో అధికారం కూడా వెలగబెట్టింది. అయితే అలాంటి యూపీఏ కూటమికి ప్రత్యేకమైన జెండా ఏమీ లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమికి కూడా ప్రత్యేకమైన జెండా లేదు. కానీ.. ఇప్పుడు జెండా అనే ఆలోచనను కూటమి భేటీల్లోకి ఎవరు తీసుకువచ్చారో గానీ.. దీని ద్వారా,.. కూటమి ని కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేయాలనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.

భారత జాతీయ జెండానే నమూనాగా తీసుకుని, మధ్యలో అశోక చక్రం లేకుండా.. అదే జెండాను ఇండియా కూటమికి పెట్టుకోవాలనే ప్రతిపాదన ముంబాయి భేటీలో చర్చకు రానున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇండియా అనే పేరును కూటమికి పెట్టడం ద్వారా.. ‘‘ఇండియాను సపోర్ట్ చేయడం అంటే.. ఇండియాను ప్రేమించడం అంటే మోడీని ఓడించడం’’ వంటి నాటకీయ నినాదాలకు అనువుగా ఆ కూటమి వ్యూహరచన చేసింది. ప్రజలను మాయ చేయడం, మభ్యపెట్టడం ఇలాంటి నామకరణం వెనుక ఉన్న అసలు లక్ష్యం. ఇప్పటిదాకా వారి ప్రవర్తన కూడా అలాగే ఉంది. మోడీని తిడుతున్న ప్రతిసారీ ఇండియా మా వెంట ఉంది.. అంటూ మాయ డైలాగులు వల్లిస్తుంటారు.

కూటమికి ఒక జెండా అనే విషయంలో కూడా ఇలాంటి మాయనే అనుసరిస్తున్నారు. అశోకచక్రం లేకుండా జాతీయ జెండానే తీసుకోవడం అంటే.. దానిని చూడగానే ప్రతి వ్యక్తికీ దేశపతాకం అనే భావన కలుగుతుంది. తద్వారా దేశాన్ని గౌరవించడం అంటే మోడీని వ్యతిరేకించడం అనే మాయ భావనను ప్రజల్లో నాటడానికి వ్యూహరచన చేస్తున్నట్టుగా ఉంది.

అయితే ఈ జెండా అనేది.. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని హైజాక్ చేసే ప్రయత్నాల్లో ఒక భాగం అనే వాదన కూడా వినిపిస్తోంది. ఎందుకంటే.. అశోకచక్రం లేని జాతీయజెండా అంటే దాని అర్థం.. హస్తం గుర్తు లేని కాంగ్రెస్ జెండా అని మాత్రమే. ఒకసారి జెండా కర్ర పైకెత్తి పట్టుకున్నాక.. అందులోని గుర్తు ఎవ్వరికీ కనిపించదు. కేవలం త్రివర్ణపతాకమే ఉంటుంది. అది కాంగ్రెస్ జెండా అవుతుంది. అంటే.. కూటమిలో భాగస్వాములైన పార్టీలన్నీ కాంగ్రెస్ జెండాను పట్టుకుని తిరగాలన్నమాట. కొందరికి అది ఓకే కావొచ్చు. కానీ.. ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్, తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ లాంటి వారికి పార్లమెంటు ఎన్నికల్లో తాము కాంగ్రెసు జెండాను పోలిన జెండాను చేతపట్టుకుని తిరగడం అవమానం మరియు ప్రమాదకరం కూడా. ప్రజలను మోసం చేయడానికి అలాంటిజెండా సెలక్ట్ చేసుకుంటే, వారికి కూడా నష్టం జరుగుతుంది. అసలే ‘ఇండియా’ అనే మాయాపూరితమైన మభ్యపెట్టే పేరు కూటమికి పెట్టినందుకు బెంగుళూరు సమావేశాల నుంచి నితీశ్ కుమార్ మధ్యలోనే అలిగి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో కూటమిని హైజాక్ చేయడానికి కాంగ్రెస్ చేస్తున్న ఈ జెండా ప్రయత్నాన్ని వారిలో ఎందరు ఆమోదిస్తారో, ఎందరు వ్యతిరేకిస్తారో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles