ఆ భయమే జగన్ బలహీనత, పతనహేతువు!

Thursday, November 21, 2024

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సిద్ధం సభల్లో విపక్ష నాయకుల మీద చాలా రెచ్చిపోయి విమర్శలు కురిపిస్తూ ఉంటారు. గొంతు జీర పోయే రేంజిలో పెద్దపెద్దగా అరచి మరీ చంద్రబాబునాయుడును, పవన్ కల్యాణ్ ను తిట్టిపోయడానికి ఆయన కష్టపడుతుంటారు. కానీ.. మొన్నమొన్నటిదాకా జరిగిన సిద్ధం సభలకు, తాజాగా ఆదివారం నాడు మేదరమిట్ట వద్ద జరిగిన సిద్ధం సభకు ఒక పెద్ద తేడా ఉంది. గత సభలలో తిట్టినట్టుగా కేవలం చంద్రబాబును, పవన్ కల్యాణ్ ను మాత్రం తిడుతూ విపక్షాలన్నీ దొంగలు అని ఒకే గాటన కట్టేయడానికి వీల్లేదు. ఈ సభకు ముందుగానే విపక్ష కూటమిలోకి భాజపా కూడా చేరుతూ అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. మరి తనను ఓడించడానికి వారితో చేతులు కలిపిన బిజెపిని కూడా జగన్ అదేస్థాయిలో విమర్శిస్తారా? లేదా, లౌక్యం పాటిస్తారా? అనేది చాలా మంది ఎదురుచూశారు. కానీ, జగన్మోహన్ రెడ్డి.. తన బలహీనతను సిద్ధం సభలో చాలా స్పష్టంగా బయటపెట్టేసుకున్నారు. బిజెపి అంటే తనలో ఉండే భయాన్ని ఆయన నిరూపించుకున్నారు. ఆ భయమే, ఆయనలోని బలహీనతే ఆయన పార్టీ ఓటమిని కూడా శాసించబోతున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీతో సత్సంబంధాలను కలిగిఉండడం వేరు- ఎన్నికల సమయంలో రాజకీయంగా పరస్పరం తలపడుతున్నప్పుడు ఉండాల్సిన తీరు వేరు. ఈ రెండింటి మధ్య ఒక సున్నితమైన విభజన రేఖ ఉంటుంది. ఆ విభజన రేఖ తెలియనివాడు రాజకీయాల్లో రాణించలేడు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అదే తరహాలో.. ఆ రాజనీతిని పాటిస్తుంటారు. ఫరెగ్జాంపుల్ తెలంగాణ రాజకీయాలను తీసుకుంటే.. ప్రధానిగా నరేంద్రమోడీ రాష్ట్రానికి వస్తే స్వయంగా వెళ్లి స్వాగతం పలికి, మోడీ మా పెద్దన్న అంటూ కితాబులిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేవలం ఒకటిరెండు రోజుల వ్యవధిలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడాల్సి వచ్చేసరికి మోడీ విధానాలను తీవ్రంగా దుమ్మెత్తిపోశారు. అదే ఇక్కడ అవసరమైన రాజనీతి! జగన్మోహన్ రెడ్డిలో లేనిది కూడా అదే. ఆయన మోడీని పల్లెత్తు మాట అనరు.
మోడీ తనకు తండ్రితో సమానం అని కీర్తిస్తారు. పథకాల ప్రారంభోత్సవాల సభల్లో అలా కీర్తించినా.. ఎయిర్ పోర్టు దగ్గరినుంచి కలిసిన ప్రతిసారీ.. ఆయన కనపడగానే కాళ్ల మీద పడిపోయి పాదాలు ముట్టుకుని దణ్నం పెట్టుకునేందుకు ప్రయత్నించినా అదంతా ఆయన ఇష్టం! అలాగని బిజెపి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా.. మోడీ పట్ల అదే మాదిరి భక్తి ప్రపత్తులను ప్రదర్శిస్తే.. కుదరదు. బిజెపి అంటే జగన్ లో భయం ఇంకా పుష్కలంగా ఉంది. మేదరమిట్ట సిద్ధం సభలో భాజపాను పెద్దగా విమర్శించకుండా పైపైనే మాటలు అనడం.. తెలుగుదేశాన్ని, జనసేనను మాత్రం తీవ్రస్థాయిలో విమర్శించడం జగన్ యొక్క ప్రధాన బలహీనతను బయటపెడుతోందని పలువురు అనుకుంటున్నారు. ఆ బలహీనతే ఆయనను ఈ ఎన్నికల్లో పరాజయం పాల్జేస్తుందని కూడా అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles