ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెడతామని ఊరించారు. తద్వారా బీసీల్లో తమ పార్టీ పట్టు పెరుగుతుందని ఊహించారు. తీరా.. కులపరమైన ఒత్తిడులకు లొంగి.. భూమన కరుణాకరరెడ్డికి ఛైర్మన్ పదవిని కట్టబెట్టాల్సి వచ్చింది. ఆశలు పెంచుకున్న జంగా కృష్ణమూర్తికి.. ప్రభుత్వం కంటితుడుపుగా టీటీడీ బోర్డు సభ్యత్వం ఆఫర్ చేయగా.. ఆయన చాలా సున్నితంగా తిరస్కరించినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. టీటీడీ బోర్డు ఏర్పాటు మూడోసారి చేపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం దీనిద్వారా గరిష్టమైన రాజకీయ లబ్ధి కోరుకుంటూ ఉండగా.. అందులో జంగా తిరస్కారం అనేది చిన్న కుదుపుగా కనిపిస్తోంది.
టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవిని నాయకులు మంత్రి పదవికంటె గొప్పదిగా భావిస్తారు. ఆధ్యాత్మిక చింతన ఉన్న వారైతే.. దేవుడికి సేవచేయగల అవకాశాన్ని మించింది లేదని అనుకుంటూ ఉంటారు. అదే సమయంలో.. పదవులను తమ స్వార్థానికి స్వప్రయోజనాలకు వాడుకోగలిగిన వారికి ఇంతకంటె గొప్పది మరొకటి ఉండదు. టీటీడీ ఛైర్మన్ గా ఉంటే వందల వేల కోట్ల సామ్రాజ్యాలకు అధిపతులుగా మారడం అనేది చాలా మామూలు విషయంగా మారిపోయింది. ఈ పదవిలో ప్రత్యక్షమైన అవినీతికి పాల్పడకపోయినప్పటికీ.. సాక్షాత్తూ టీటీడీ సొమ్మును ఒక్క పైసాకూడా స్వాహా చేయకపోయినప్పటికీ.. వందల కోట్లకు పడగలెత్తడం వారికి సునాయాసమైన సంగతి. ఆ పదవి ద్వారా ఏర్పడే జాతీయస్థాయి ప్రముఖుల పరిచయాలు, తద్వారా కలిగే లబ్ధి అనల్పంగా ఉంటుంది. అందుకే అందరూ ఎగబడుతుంటారు.
అలాంటి పదవిని తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. రెండుసార్లు చిన్నాన్న సుబ్బారెడ్డికే జగన్ కట్టబెట్టారు. మూడోసారి ఎన్నికలు పొంచి ఉండగా.. బీసీ నాయకుడు జంగాకృష్ణమూర్తికి ఇస్తారని ప్రచారం జరిగింది. తద్వారా బీసీ ఓటు బ్యాంకు కోసం ఆరాటపడ్డారు. అయితే భూమనకు పదవి దక్కింది. జంగా కృష్ణమూర్తిని ఊరడించడానికి ఆయనకు బోర్డు సభ్యత్వం ఆఫర్ చేయగా ఆయన తిరస్కరించినట్టు గుసగుసలున్నాయి. ఈ టర్మ్ పూర్తయిన తర్వాత అయినా.. తనకు ఛైర్మన్ పదవి మాత్రమే కావాలని పట్టుబట్టినట్టు సమాచారం.
జంగా కృష్ణమూర్తికి పదవిని తిరస్కరించడం ద్వారా.. బీసీల్లో ఏర్పడగల అసంతృప్తిని దువ్వడానికి వైసీపీ ప్రభుత్వం మరో ప్రయత్నంలో ఉన్నట్టుగా వినవస్తోంది. సాధారణంగా బోర్డు సభ్యత్వాల్లో కొన్నింటిని రాష్ట్రానికి చెందిన వారికి ఇచ్చి, మిగిలినవి ఇతర రాష్ట్రాల వారు, కార్పొరేట్ ఆబ్లిగేషన్లకు కట్టబెడతారు. అయితే ఈసారి వీలైనంత వరకు అన్ని సభ్యత్వపదవులను స్వరాష్ట్రంలోని వారికే ఇచ్చేయాలని, అందులో కులాల సమతూకం పాటించడం ద్వారా.. ఓటు బ్యాంకుకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలని వైసీపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.