ఉద్యోగ సంఘాలకు రకరకాల ఆఫర్లు ప్రకటించడం ద్వారా.. ఆ వర్గాన్ని మొత్తం బుజ్జగించేసినట్టుగా జగన్ సర్కారు భావించింది. ప్రధానంగా వారికి మూడు వరాలు ప్రకటించి.. అక్కడితే అంతా సద్దుమణిగినట్టే ప్రభుత్వం చెప్పుకుంది. 12వ పీఆర్సీ వేయడం, సీపీఎస్ రద్దు చేసి జీపీఎస్ తేవడం, కాంట్రాక్టు ఉద్యోగుల్ని పర్మినెంటు చేయడం ఆ మూడు వరాలు. అయితే నిజం చెప్పాలంటే ఈ మూడు వరాలు కూడా బెడిసి కొట్టినట్టే. 12 వ పీఆర్సీ హామీ పట్ల ఉద్యోగులు పెద్దగా మురిసిపోవడం లేదు. పైగా, 11వ పీఆర్సీ బకాయిల సంగతి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగాలను పర్మినెంటు చేసే వరం కూడా ఫలితమివ్వలేదు. 2014 విభజన నాటికి అయిదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారిని మాత్రమే పర్మినెంటుచ స్తున్నట్టు సర్కారు ముందే చెప్పింది. అయితే.. అందులో కూడా అనేక పితలాటకం వంటి నిబంధనలు పెట్టడం ఉద్యోగులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఉద్యోగుల జీపీఎస్- (సీపీఎస్ రద్దు) అనేది మాత్రమే మరో ఎత్తు!
జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు పూర్వం పాదయాత్ర చేస్తుండగా, సీపీఎస్ రద్దు గురించి చాలా గట్టిగా హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేసి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకువస్తానని మాట ఇచ్చారు. అది నమ్మి ఉద్యోగులు ఆయనకు ఓట్లు వేసి గెలిపించారు. అయితే గెలిచిన నాటినుంచి జగన్ దాని గురించి పట్టించుకోలేదు. సుదీర్ఘ పోరాటాల తర్వాత.. సీపీఎస్ రద్దు వరకు ఓకే అంటున్నారు గానీ.. ఓపీఎస్ కు మాత్రం ఎస్ చెప్పడం లేదు. మధ్యేమార్గంగా జీపీఎస్ తెస్తామని అంటున్నారు. అనేక మార్పుల తర్వాత.. ఉద్యోగులకు ఓపీఎస్ లబ్ధికి దగ్గరగా ఉండేలా జీపీఎస్ తెస్తాం అని కూడా అంటున్నారు.
అయితే ఈ జీపీఎస్ పట్ల ఉద్యోగవర్గాలు సంతృప్తిని వ్యక్తం చేయడంలేదు. తాజాగా సీపీఎస్ వర్గానికి చెందిన ఉద్యోగసంఘాల నేతలు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుని తమ పోరాటపంథాను ప్రకటించారు. ప్రభుత్వ ప్రతిపాదనలు ఆమోదించేది లేదని, ఓపీఎస్ అమల్లోకి తెచ్చేదాకా తమ పోరాటం కొనసాగుతుందని వారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రాక్టికల్ గా రాగల ఇబ్బందులు చూసుకోకుండా.. పాదయాత్ర సమయంలో ఎడాపెడా వరాలు కురిపిస్తూ ఓపీఎస్ గురించి కూడా చెప్పేశారు. ఆ తప్పు ఆయనను ఇప్పటికీ వెంటాడుతోంది. ‘మడమ తిప్పను, మాట తప్పను’ అనే నినాదాన్ని గట్టిగా చెప్పాలంటే.. ఆయనే సంకోచించేలా ఓపీఎస్ వ్యవహారం తయారైంది. ఉద్యోగ సంఘాలు మాత్రం మాట తప్పిన జగన్ ను అస్సలు నమ్మకపోగా, ఆయన ఓటమికే కంకణం కట్టుకుని పనిచేస్తుండడం విశేషం.