‘ఆ ఒక్కటీ తప్ప..’: వరాలు కురిపించిన కేసీఆర్!

Monday, September 16, 2024

మరో అయిదు నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉండేలా ఉద్యోగ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు కేసీఆర్ సరికొత్త ప్రణాళికలను అమలు చేస్తున్నారు. తెలంగాణ సాధన దశాబ్ది ఉత్సవాల సందర్భంగా.. ఉద్యోగులు అందరికీ ఒక నెల డిఎను ప్రకటించిన రోజుల వ్యవధిలోనే వారికి మరిన్ని వరాలు కురిపించడం విశేషం. అలవెన్సులు, అడ్వాన్సుల రూపంలో ఉద్యోగులు ఇప్పుడు పొందుతున్న మొత్తాలను భారీగా పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉద్యోగులకు ఇది పండగే అని చెప్పాలి. డిఎ పెంపు ఆనందంనుంచే ఇంకా తేరుకోని ఉద్యోగులు, ఈ వరాలతో ఉక్కిరిబిక్కిరి అవుతారనడంలో సందేహం లేదు. అయితే ఉద్యోగులు అడగని, ఊహించని వరాలన్నీ కేసీఆర్ కురిపిస్తున్నారు గానీ.. వాస్తవంలో వారు కోరుకుంటున్న, ఎదురుచూస్తున్న వరాన్ని మాత్రం ప్రకటించడం లేదు. అదే ఉద్యోగులకు సరికొత్త పీఆర్సీ!

తాజాగా కేసీఆర్ సర్కారు ఉద్యోగులకు ప్రకటించిన వరాల్లో చాలా ఉన్నాయి. ట్రావెలింగ్ అలవెన్సును 30 శాతం, బదిలీపై వెళ్లే వారికి ట్రాన్స్ పోర్టు అలవెన్సు 30 శాతం, సెలవురోజుల్లు పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లకు అదనంగా రూ.150, షెడ్యూల్ ఏరియాల్లో చేసే వారికి కాంపన్సేటరీ అలవెన్స్ 30 శాతం, దివ్యాంగ ఉద్యోగుల అలవెన్సను 3000కు పెంచడం వంటివి ఉన్నాయి. ఇళ్లు నిర్మించుకునే ఉద్యోగులకు ఇచ్చే ఎడ్వాన్స్ పరిమితిని రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కారు కొనే వారికి ఇచ్చే ఎడ్వాన్సును 6 లక్షఃల నుంచి 9 లక్షలకు పెంచారు. పిల్లల పెళ్లిళ్లకు ఇచ్చే ఎడ్వాన్సులను కూడా ఏకంగా నాలుగు రెట్లు పెంచారు. పెన్షనర్లు మరణిస్తే తక్షణసాయంగా అందించే మొత్తాన్ని 30 వేలరూపాయలకు పెంచారు. ఇవన్నీ మంచి వరాలే. ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యే అంశాలే. కానీ.. తెలంగాణ ఉద్యోగులు కేసీఆర్ తమకు కొత్త పీఆర్సీని ప్రకటించడం గురించి కొంతకాలంగా నిరీక్షిస్తున్నారు. ఆ దిశగా మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

పీఆర్సీ విషయంలో గత పీఆర్సీ అమలు సమయంలోనే ఉద్యోగుల్లో తీవ్రస్థాయిలో ప్రభుత్వం పట్ల అసంతృప్తి వెల్లువెత్తింది. కేసీఆర్ సర్కారు మీద ఉద్యోగ వర్గాలంతా కూడా ఆగ్రహించారు. ఆ తర్వాత.. పొరుగున ఏపీలో పీఆర్సీ విషయంలో అక్కడి సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులను కొట్టిన దెబ్బ చూసి.. తెలంగాణ ఉద్యోగులు సైలెంట్ అయ్యారు. వారికి అప్పట్లో ఆశకు తగ్గట్టుగా లేకపోయినా మిన్నకుండిపోయారు. కానీ.. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సమయంలో వేసే కొత్త పీఆర్సీలో తమకు బాగా న్యాయం జరుగుతుందని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. కొత్త పీఆర్సీ వేయాల్సిన సమయం కూడా వచ్చేసింది. అయితే కేసీఆర్ సర్కారు ఆ అంశాన్ని మాత్రం ఇప్పటిదాకా ప్రస్తావించలేదు. మరి ఈ వరాలతోనే ఉద్యోగులు సంతృప్తి చెందుతారో.. కొత్త పీఆర్సీ కోసం పట్టుబట్టి మొండికేస్తారో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles