రాష్ట్రంలోని రాజకీయం ‘రాజధాని’ అనే ఒకే అంశం మీద రెండు వర్గాలుగా విడిపోయి ఉంది. మూడు రాజధానులు అనేది వైఎస్సార్ కాంగ్రెస్ వాదన అయితే, అమరావతి ఏకైక రాజధాని అనేది తెలుగుదేశం, జనసేన, బిజెపి, వామపక్షాల వాదన. ప్రజలు ఏం కోరుకుంటున్నారనేది తెలియడానికి ఇంకా సుమారు ఏడాదిన్నర వెయిట్ చేయాలి. కానీ ఈ విషయాన్ని నిర్ధరించే ఒక చిన్న ప్రీఫైనల్ లాంటి ఎన్నిక కొత్త సంవత్సరంలో జరగబోతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ఏ పార్టీ గెలుస్తుందనేది ఆ ప్రాంతంలో ఆ వర్గానికి, ఆ వాదనకు నైతిక బలాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.తమ పార్టీ తరఫున గాడు చిన్నికుమారి లక్ష్మిని ఇప్పటికే అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఉత్తరాంధ్ర మొత్తం ప్రతి పట్టభద్రుడిని కలుసుకుని, రాష్ట్రంలోని పరిస్థితులను తెలియజెప్పి ఎమ్మెల్సీ ఎన్నికలో విజయం సాధించాలని తెలుగుదేశం వ్యూహరచన చేస్తోంది.
మూడు రాజధానుల ద్వారా.. ఉత్తరాంధ్ర గొప్పగా అభివృద్ధి చెందుతుందని వైసీపీ వాదిస్తోంది. అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలని డిమాండ్ చేసేవారు ఉత్తరాంధ్ర ద్రోహులు అనే వాదన కూడా తెరపైకి తెస్తోంది. కానీ, వారి ప్రచారం ఎలా ఉన్నప్పటికీ.. అదే ఉత్తరాంధ్రలో చంద్రబాబునాయుడు గానీ, పవన్ కల్యాణ్ గానీ పర్యటించిన ప్రతి సందర్భంలోనూ ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఆ స్పందనను గమనిస్తే.. అసలు మూడు రాజధానులు తమకు మేలుచేస్తాయనే వైసీపీ వాదనను ప్రజలు పట్టించుకోవడం లేదేమో అనే అభిప్రాయం కలుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో పట్టభ్రద ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది.
సాధారణంగా సాధారణ ఎన్నికల కంటె పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికకు ఒక ప్రయారిటీ ఉంటుంది. ఓటర్లు అందరూ చదువుకున్న వారే కాబట్టి, వారి ఓటుకు, అభిప్రాయానికి ప్రత్యేకమైన విలువ ఉంటుంది. ఈ ఎన్నికలో గెలిచే వారికి, ఉత్తరాంధ్రప్రాంతంలోని చదువరులు, ఆలోచనపరుల మద్దతు ఉంటుందని అనుకోవాలి. ఓట్లను కొనుగోలుచేసి ఎన్నికల్లో ఫలితాలను శాసించే దుర్మార్గపు పోకడలు పెచ్చరిల్లిన తర్వాత.. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అందుకు అతీతం కాకుండాపోయాయి. చదువు అవగాహన ఉన్న వారు గనుక.. నాయకులు వచ్చి డబ్బు ఇచ్చే వరకు ఎదురుచూడకుండా, ఓ పదిమంది పట్టభద్రులు సమూహంగా ఏర్పడి అభ్యర్థులకే ఫోనుచేసి డబ్బులు అడిగిపుచ్చుకుంటున్నారు. అలాంటి అపభ్రంశపు పోకడలు లేకపోతే గనుక.. ఈ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యక్తమయ్యే ప్రజాభిప్రాయం అమరావతి- మూడు రాజధానులు విషయంలో ఒక ప్రీఫైనల్ లాంటిదని అనుకోవచ్చు. ఉభయుల్లో ఎవరు విజయం సాధించినా ఈ విజయం వారికి నైతిక మద్దతు ఇస్తుందనడంలో సందేహం లేదు.
ఆ ఎన్నిక.. ఉభయులకు నైతిక సవాలు!
Friday, November 15, 2024