ఆలూచూలూ లేకుండా ఉద్యోగాలంటున్న జగన్!

Wednesday, January 22, 2025

ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉంది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళి. ఇప్పటిదాకా జగన్ అధికారం వెలగబెట్టడం ప్రారంభించిన నాలుగేళ్లలో చెప్పుకోదగ్గ పరిశ్రమ ఒక్కటి కూడా రాష్ట్రంలో ప్రారంభం కాలేదు. ఒప్పందాలనీ, శంకుస్థాపనలనీ రకరకాల మాటలతోనే రోజులు నెట్టుకొస్తున్నారు. కాకపోతే.. రాబోయే పరిశ్రమలలో ఏర్పడబోయే ఉద్యోగాలలో 75 శాతం స్థానికులకే ఇవ్వాలని ముఖ్యమంత్రి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

75 శాతం స్థానికులకు ఉద్యోగాలు అనేది.. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న మంచినిర్ణయాలలో ఒకటి. ఆచరణాత్మక దృక్పథంతో చూసినప్పుడు కొన్ని పరిశ్రమలు దీనిపట్ల విముఖత చూపించవచ్చు గానీ.. స్థానికులకు మేలు జరుగుతుంది. కానీ.. ఏనాడో ఈ మాట ప్రకటించారు గానీ.. ఈ కోటా కింద ఏర్పడిన ఉద్యోగాలు, స్థానికులకు దక్కినవి ఎన్ని అనేది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న.

ఇప్పుడు మళ్లీ జగన్ ఆ 75 శాతం పాట పాడుతున్నారు. ఏపీలో ప్రారంభం కావల్సిఉన్న అనేక పరిశ్రమలను రకరకాల వేధింపులతో వెళ్లగొట్టారనే విమర్శలు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నాయి. అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. 75 శాతం ఉద్యోగాల కల్పన అనే అంశాన్ని అడ్డు పెట్టుకుని అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని పరిశ్రమలపై దందా సాగించిన దృష్టాంతాలున్నాయి. బెదరగొట్టిన ఉదాహరణలున్నాయి. పరిశ్రమలు పెట్టదలచుకున్న వారు ఆ ఆలోచన మానుకుని, ఆల్రెడీ పెట్టేసిన వారు కంగారుపడిపోయిన సంఘటనలు జరిగాయి. ఇప్పుడు మళ్లీ జగన్ అదే 75 శాతం పాట పాడుతున్నారు.

ఆతిథ్య రంగంలో కొన్ని హోటళ్లు, కొన్ని పరిశ్రమలు త్వరలో రాబోతున్నాయనేది జగన్ ఉవా! వాటన్నింటిలో కూడా ఇలా స్థానిక కోటా పాటించాలని అంటున్నారు.  నిజానికి ఉత్పాదక రంగం, సాంకేతిక అంశాలతో ముడిపడిన పరిశ్రమలకు 75 శాతం నిబంధనను పాటించడం అనేది చాలా కష్టం. అయితే కంపెనీల సాధకబాధకాలు తనకు అనవసరం అన్నట్టుగా జగన్ మాట్లాడుతున్నారు.

తాను అధికారంలోకి వచ్చినప్పటినుంచి పరిశ్రమలే తీసుకురాలేకపోగా, చివరి ఏడాదిలో చిన్న చిన్న సంస్థలు, వందల్లో ఏర్పడగల ఉద్యోగావకాశాలను చూపించి.. తాను యువత ఉపాధికి పెద్దపీట వేస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చుకోడానికి జగన్ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. తద్వారా ప్రతి ఏడాది జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని జగన్ మాటతప్పారనే విపక్షాల విమర్శలు అడ్డుకోవచ్చునని, జగన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ సామెత చెప్పినట్టుగా అసలు రాష్ట్రానికే పరిశ్రమలే రాకుండా, కొన్ని ఏళ్లు పట్టగల ప్రాజెక్టులకు ఇప్పుడు శంకుస్థాపన చేసి.. వాటి ద్వారా రాగల ఉద్యోగాలను స్థానికులకు కేటాయించాలనే మెరమెచ్చు మాటలతో జగన్మోహన్ రెడ్డి మాయ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles