వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో జరిగిన లావాదేవీల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలకు సంబంధించిన కేసుల్లో నిందితులు అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పక్ష నాయకుడు విజయసాయిరెడ్డి ఇద్దరూ ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. సుదీర్ఘకాలంగా వారు బెయిల్ మీదనే ఉన్న సంగతి తెలిసిందే. బెయిల్ షరతుల ప్రకారం వారు విదేశాలకు వెళ్లాలంటే గనుక.. విచారణ జరుగుతున్న సీబీఐ కోర్టునుంచి అనుమతి తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు నాయకులు కూడా తమకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతులు కావాలని, తదనుగుణంగా బెయిల్ షరతులు సవరించాలని సీబీఐ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ ఇద్దరు నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి తన విదేశీయాత్రకు పేర్కొంటున్న కారణం సహేతుకంగానే ఉంది. సెప్టెంబరు 2న లండన్ లోని తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. నిజానికి సెప్టెంబరు 2 ఆయన తండ్రి వైఎస్సార్ వర్ధంతి కూడా. ఆ రోజున ఆయన ఖచ్చితంగా ఇడుపులపాయ వెళ్లి తండ్రికి నివాళులు అర్పిస్తుంటారు. అలాంటిది ఆ కార్యక్రమం ఉన్నా కూడా.. లండన్ లోని కూతురు వద్దకు వెళ్లాలంటున్నారంటే ముఖ్యమైన కారణం ఉంటుందని అందరి అభిప్రాయం.
అయితే ఎంపీ విజయసాయిరెడ్డి కూడా తనకు విదేశాలు తిరిగేందుకు అనుకూలంగా బెయిల్ షరతులు సడలించాలని పిటిషన్ వేశారు. యూనివర్సిటీలతో ప్రభుత్వం తరఫున ఒప్పందాలు కుదుర్చుకోవడానికి యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ దేశాలు తిరిగేందుకు అనుమతి కోరారు. యూనివర్సిటీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవాలంటే.. వారికి విద్యాశాఖకు చెందిన మంత్రి లేరా? ఆ శాఖకు బాధ్యత వహించే ఐఏఎస్ అధికారులు ఉండరా? అసలు ఏపీ విద్యాశాఖ వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేని విజయసాయిరెడ్డి ఒప్పందాల కోసం విదేశాలకు వెళ్లడం ఏమిటి? అనేది అనేకమందికి కలుగుతున్న సందేహం.
అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విదేశాల్లో ఉన్న పార్టీ అభిమానుల నుంచి పార్టీకి నిధుల సేకరణకే విజయసాయి విదేశాల యాత్ర చేస్తున్నారని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. విదేశాల్లో దాచిన డబ్బును హవాలా రూపంలో తరలించడానికి సన్నాహాలు చేయడమే లక్ష్యమని పలువురు విమర్శిస్తున్నారు. జగన్ మీద ఉన్న అనేక ఆర్థిక నేరాలకు సంబంధించి.. సూట్ కేసు కంపెనీలు ఏర్పాటుచేయడం, విదేశాల నుంచి అక్రమ మార్గాల్లో నిధుల తరలింపు వంటి అనేక ఆరోపణలు విజయసాయిరెడ్డి ఎదుర్కొన్నారు. ఇప్పుడుకూడా పార్టీ నిధుల కోసం అలాంటి అనుచిత లావాదేవీల కోసమే ఆయన విదేశాలకు వెళ్లడానికి అనుమతులు కోరుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆయన విదేశీయాత్ర ఎన్నికల నిధులకోసమేనా?
Tuesday, November 19, 2024