ఆనం ఉవాచ : దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం..

Monday, December 23, 2024

కంగారు పడొద్దండి.. ఆనం అంటే.. ఆనం రామనారాయణరెడ్డి గురించే. ఆయన ప్రస్తుతం తెలుగుదేశంలో లేరు, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంతో సన్నిహితులు, విశ్వసనీయులు అనే కోటాలో ఆయన మంత్రివర్గంలో పనిచేసిన ఆనం రామనారాయణ రెడ్డి ప్రస్తుతం తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ముక్కుసూటిగా మాట్లాడడంతో పలుమార్లు వార్తల్లో వ్యక్తిగా నిలిచిన ఆనం రామనారాయణరెడ్డి తాజాగా ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేశారు. ఒక రేంజిలో విరుచుకుపడ్డారు. ఏం చేశామని ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగగలం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అనే చెప్పాలి. వైఎస్ జగన్ ను ఏమాత్రం ఖాతరు చేయకుండా తనకు ఏది కరెక్టు అనిపిస్తే అది మాట్లాడే నైజం ఆనం ది! ఆయన వైకాపా కన్వీనర్లు, వాలంటీర్లతో నిర్వహించిన సమావేశంలో అధికార పార్టీ, ప్రభుత్వం మీదనే విరుచుకుపడ్డారు. రోడ్ల గుంతలు పూడ్చడం లేదు, తాగడానికి నీళ్లు లేవు, నాలుగేళ్లలో ఏంచేశామని ప్రజలు మనకు ఓట్లేస్తారు.. అంటూ ఆయనే అనడం గమనార్హం. పింఛను ఇచ్చినందుకే ఓట్లు వేసేట్లయితే గత ప్రభుత్వం కూడా బాగానే ఇచ్చిందని అది చాలదని ఆనం.. వైఎస్ జగన్ కు పరోక్షంగా హితవు చెప్పారు. 

నెల్లూరు జిల్లాలో ఎస్ఎస్ కెనాల్ ప్రస్తావన తెచ్చి, అది పూర్తికాకపోవడంపై ఆనం ఫైర్ అయ్యారు. సీఎం జగన్ కు ఎన్నోసార్లు చెప్పినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కండలేరు అభివృద్ధి విషయంలో వైఎస్ కలను నెరవేర్చలేకపోయామని, వైఎస్ఆర్ కలను తీర్చలేని దౌర్భాగ్యస్థితిలో మనం ఉన్నాం అని ఆనం పంచ్ వేయడం విశేషం. ఒకవైపు వైఎస్సార్ పేరు చెప్పుకునే ఇప్పటికీ.. వైఎస్సార్ కాంగ్రెస్ మనుగడ సాగిస్తున్న నేపథ్యంలో.. నీటిప్రాజెక్టుల మీద అపరిమిత శ్రద్ధ ఉన్న వైఎస్సార్ కలలను జగన్ అసలు పట్టించుకోవడంలేదని ఆయన పార్టీ ఎమ్మెల్యేనే ఆగ్రహించడం ఇప్పుడు ప్రజలను ఆలోచింపజేస్తోంది. 

ప్రజలు నన్ను కూడా నమ్మే పరిస్థితిలేదు. అపనమ్మక వ్యవస్థలో పనిచేస్తున్నాం.. అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని అర్థం వచ్చేలా ఆనం రామనారాయణ రెడ్డి మాటలు సొంత పార్టీ మీదనే దాడిగా పలువురు భావిస్తున్నారు. అసలు రాజకీయంగా చైతన్యవంతమైన పూర్వ నెల్లూరుజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ లో ఏం జరుగుతోందో అర్థం కావడంలేదు. గత ఎన్నికల్లో ఆ జిల్లాను పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఇప్పుడు తిరుగుబాట్లు పెరిగాయి. ఒక్క పెన్షను తీసేసినా ఊరుకోనని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహిస్తే, ఇప్పుడు మనకు ఓట్లు పడవు అని ఆనం అంటున్నారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ చాలా కాలంగా పార్టీ పట్ల విముఖంగానే ఉన్నారు. మరి నెల్లూరు రాజకీయాలు ఎలా మలుపు తిరుగుతాయో ఏమో?

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles