తెలంగాణ భారతీయ జనతా పార్టీ మితిమీరిన అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటుంది. పొత్తుల మాట ఎవరైనా ఎత్తితే చాలు.. తమ పార్టీ ఒంటరిగానే పోటీచేస్తుందని, రాష్ట్రంలోని అన్నిస్థానాల్లో ఒంటరిగా బరిలోకిదిగి సంచలనం సృష్టిస్తుందని గప్పాలు కొడుతుంటుంది. ఇన్నాళ్లూ అలా డాంబికంగా చెప్పుకోవడం వేరు.. తీరా ఇప్పుడు ఎన్నికల ముంగిట్లోకి వచ్చిన తర్వాత.. కాస్త కష్టపడితే అధికారం కూడా దక్కవచ్చునేమో అనే ఆశ కూడా కలుగుతున్న వేళ.. తె-బిజెపి తమ అహంకారాన్ని వీడాల్సిన అవసరం ఉంది. బిజెపితో కలిసి పోటీచేసేందుకు పార్టీలు ముందుకు వస్తే అంగీకరించాల్సిన అవసరం ఉంది.
కేంద్ర నాయకత్వం సంగతి ఎలా ఉన్నప్పటికీ.. తెలంగాణ రాష్ట్ర బిజెపి మాత్రం.. పొత్తులకు విముఖంగా ఉంటుంది. తాము అనుభవించాల్సిన అధికారాన్ని , వైభవాన్ని ఇతరులకు కూడా పంచిపెట్టేయాల్సి వస్తుందని వారికి బాధ! అందుకే పవన్ కల్యాణ్ జనసేన ఎన్డీయేలో భాగస్వామి పార్టీ అయినప్పటికీ.. తెలంగాణ బిజెపి పవన్ ను ఎన్నడూ పట్టించుకోనేలేదు. జనసేనతో తమ పొత్తులు ఏపీకి మాత్రమే పరిమితం అవుతాయని కూడా వారు వివిధ సందర్భాల్లో ప్రకటించారు. జనసేన కూడా.. తెలంగాణ ఎన్నికల్లో పోటీచేయాలనుకున్నప్పటికీ, ఒంటిరిగా పోటీచేసే ఆలోచనలనే బయటపెట్టింది. ఇటీవల చంద్రబాబునాయుడు అమిత్ షా తో సమావేశమైనప్పుడు.. ఈ రెండు పార్టీల మద్య పొత్తు కుదిరితే ఉభయులకు లాభం అని.. తెలంగాణలో బిజెపి లాభపడుతుంది.. ఏపీలో తెలుగుదేశం లాభపడుతుందని అందరూ అంచనా వేశారు. అయితే రాష్ట్ర బిజెపి నాయకులు మాత్రం ఆ పొత్తుల్ని కూడా కొట్టి పారేశారు.
తాజాగా ఆ పరిస్థితి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉన్న హవా, దూకుడు నేపథ్యంలో కేసీఆర్ కు ప్రధాన ప్రత్యర్థిగా తలపడే స్థాయి కాంగ్రెసుకే ఉంటుందేమో అనే అభిప్రాయాలు ప్రజల్లో కలుగుతున్నాయి. వీటిని అధిగమించి.. బిజెపి రేసులో ముందుకు రావాలంటే.. మరింత బలంగా కనిపించాలి. అసలే పార్టీనుంచి నాయకులు కొందరు కాంగ్రెసులోకి ఫిరాయించాలనే ఆలోచన చేస్తున్నట్టు కూడా పుకార్లు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో.. తె-బిజెపి అహంకారాన్ని వీడాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం, జనసేన పొత్తులకు సిద్ధపడితే వారితో సీట్లు పంచుకోవడానికి ముందుకు రావాలి. మనస్ఫూర్తిగా సహకరించాలి. లేకపోతే.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ పట్టుమని పదిసీట్లు కూడా దక్కించుకోకుండా చతికిలపడుతుందనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.