అసలే అవినాష్ మనుషులు.. ఆపై తాగి ఉన్నారు..

Saturday, January 18, 2025

అసలే ఆవేశాలకు పేరుమోసిన కడప జిల్లాకు చెందిన నాయకులు.. ఆపై తాగి ఉన్నారు.. ఆపై వారంతా ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు.. ఆపై అధికార పార్టీ అండదండలున్నవారు.. ఆపై, పోలీసులు తమను అడ్డుకోలేరనే ధీమా ఉన్నవారు.. ఆపై మీడియాపై రగిలిపోతున్నారు.. ఆపై… ఇలా చెప్పుకుంటూ పోతే వారి దుడుకు తనానికి దారితీయగలిగిన ఇంకా అనేకానేక కారణాలు జాబితాలోకి వస్తాయి. మొత్తానికి అవినాష్ అనుచరులు, తమ ఎంపీ తల్లి చికిత్స పొందుతున్న కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి వద్ద వీరంగం సృష్టించారు. మీడియా ప్రతినిధుల మీద ఎడాపెడా దాడికి దిగి బెంబేలెత్తించారు. విలేకర్లను దొరకబుచ్చుకుని దాడిచేశారు, కెమెరాలు లాక్కుని ధ్వంసంచేశారు.. సాధారణ పౌరులను కూడా అడ్డగించి, వారి మొబైల్స్ లాక్కుని, వారు విలేకర్లు కాదని అనిపించిన తర్వాతే తిరిగిచ్చారు. ఇలా నానా హంగామా చేశారు.

ప్రస్తుతం ‘‘వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర’’ అనే అంశం రాష్ట్రమంతా హాట్ టాపిక్ గా చెలామణీ అవుతోంది. కేసుకు ఉన్న ప్రాధాన్యం, సీబీఐ విచారణ దాదాపుగా పూర్తయి ఒక కొలిక్కి వస్తుండడం, అవినాష్ తండ్రి అరెస్టు అయి ప్రస్తుతం జైల్లో ఉండగా, సీబీఐ విచారణకు పిలిచిన చాలా సందర్భాలలో అవినాష్ తప్పించుకు తిరుగుతుండడం.. ఇలాంటి వ్యవహారాలన్నీ కలిపి ఈ టాపిక్ కు హైప్ పెంచుతున్నాయి.

ఇంత కీలకమైన కేసులో- అవినాష్ తల్లి గుండెపోటుతో కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడం అనేది ఒక చిన్న పాయింట్. కానీ, తల్లి డిశ్చార్జి అయితే తప్ప తాను విచారణకు రాలేనని అవినాష్ తెగేసి చెప్పిన నేపథ్యంలో ఆ పాయింట్ చుట్టూ మీడియా ఫోకస్ ఉండడం సహజం. కర్నూలు ఆస్పత్రి వద్ద కూడా మీడియా వాళ్లు వేచి ఉంటున్నారు. అయితే  ఆదివారం రాత్రి బాగా తాగిన అవినాష్ అనుచరులు ఆస్పత్రి బయట ఉన్న మీడియా వారిపై దాడికి దిగారు. విలేకర్లంతా అక్కడినుంచి పరుగులు తీయాల్సి వచ్చింది.  అవినాష్ మనుషులు ఆ రోడ్డును దిగ్బంధనం చేసి మీడియా వారిని వెంటపడుతోంటే.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు.

అయినా సాక్షాత్తూ సకల శాఖా మంత్రిగా ప్రతిపక్షాలు పేర్కొంటూ ఉండే, పోలీసు శాఖను మొత్తం తానే నడిపిస్తుంటారని ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండే సజ్జల రామకృష్ణా రెడ్డి.. ‘ఎంపీ గారి అనుచరులు అప్పుడప్పుడూ సంయమనం కోల్పోవచ్చు’ అనే మాట ద్వారా సంకేతాలు పంపిన తర్వాత.. ఇక వారు దాడుల పర్వంలో ఎడాపెడా రెచ్చిపోకుండా ఉంటారా? తమకు ఎవరి మీద కోపం వస్తే వారి నడ్డివిరచకుండా ఉంటారా? అని ప్రజలు ఈసడించుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles