ఖమ్మం జిల్లా కీలక నాయకుల్లో ఒకరు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కేసీఆర్ మీద తన తిరుగుబాటు ఉద్యమాన్ని మరింత హీటెక్కిస్తున్నారు. మొన్నమొన్నటిదాకా గులాబీ పార్టీలోనే ఉన్న ఈ నాయకుడు.. ఇటీవలే అసంతృప్తితో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున పోటీచేస్తానో తర్వాత ప్రకటిస్తానని.. భవిష్యత్ ప్రస్థానం గురించి కాస్త సస్పెన్స్ ను ప్రజలకు విడిచిపెట్టారు. అప్పటినుంచి కేసీఆర్ మీద వరుస విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అయితే.. తాజా పరిణామాలను గమనిస్తే.. తనలాంటి అసంతృప్త గులాబీలు అందరినీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడగడుతున్నట్టుగా కనిపిస్తోంది.
తాజాగా ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనన్న అభిమానుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. తాను గులాబీ పార్టీనుంచి బయటకు రావడానికి డిసైడ్ అయిన తొలిరోజు నుంచి పొంగులేటి వరుస ఆత్మీయ సమ్మేళనాలు, విందులతో దూసుకుపోతున్నారు. ఈ కార్యక్రమంలో కూడా కేసీఆర్ ను ఉద్దేశించి.. అన్నిరోజులూ ఒకలాగా ఉండవని, కేసీఆర్ ఎవరెవరినైతే ఇబ్బందిపెట్టారో వాళ్లందరికీ ఒక రోజు వస్తుందని పొంగులేటి హెచ్చరించారు.
ఈసందర్భంగా జరిగిన సభకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా హాజరు కావడం విశేషం. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత జూపల్లి కూడా కేసీఆర్ తో అంటీముట్టనట్టుగా అసంతృప్తిగానే ఉన్నారు. 2014లో తొలిసారిగా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు.. తొలుత జూపల్లికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. అయితే అప్పట్లో కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న మైహోమ్ జూపల్లి రామేశ్వరరావు చాలా తీవ్రంగా ఒత్తిడి చేశారని, ఆయన ఒత్తిడికి తలొగ్గి జూపల్లి కృష్ణారావుకు కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారని అప్పట్లో పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత మైహోమ్ రామేశ్వరరావు- కేసీఆర్ ల మధ్య సంబంధ బాంధవ్యాలు దెబ్బతిన్నాయి. దానికి తగ్గట్టుగానే కృష్ణారావు రాజకీయ గ్రాఫ్ కూడా మారిపోయింది. గులాబీదళంలో అసంతృప్త నాయకుడిగా ఉంటూ, ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు.
ఇప్పుడు పొంగులేటి నిర్వహిస్తున్న కార్యక్రమాలకి వచ్చి కేసీఆర్ ని విమర్శించడం చూస్తోంటే అసంతృప్త గులాబీలను పొంగులేటి కూడగడుతున్నట్టుగా కనిపిస్తోంది. వీరందరినీ ఒక జట్టుగా తయారు చేసుకుని.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాను చేరబోయే పార్టీకి బేరం పెడతారేమో అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అసంతృప్త గులాబీల్ని కూడగడుతున్న పొంగులేటి!
Sunday, December 22, 2024