‘జగనన్నే మా భవిష్యత్తు’ అంటూ ‘నువ్వే మా నమ్మకం జగన్’ అని భరోసా అందించేలా, ప్రజలు బలవంతంగా ఒప్పుకునేలా చేసే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభం అయింది. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బృందాలు బృందాలుగా విడిపోయి, ప్రజల ఇళ్లకు తిరుగుతూ పార్టీ నిర్దేశించిన ప్రకారం చంద్రబాబు చేసిన పనులన్నీ ప్రజా ద్రోహాలే అని వారికి తెలియజేస్తూ… జగనన్న చేస్తున్న పనులన్నీ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి మాత్రమే అని నమ్మిస్తూ… మొత్తానికి వారితో చిన్న సర్వే కూడా పూర్తిచేసి.. వారి ఇంటి వాకిట పెద్ద స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రజల వద్దకు నాయకులు రావడం అంటూ జరిగితే వారు తమ కష్ట నష్టాలు అన్నింటిని నివేదించుకునే వాతావరణం ఉంటుంది. గడపగడపకు కార్యక్రమంలో కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 175 నియోజకవర్గాలలో ఇంటింటికి తిరుగుతున్న ఎమ్మెల్యేలకు ప్రజల నిరసనల సెగ తగిలింది. అయినా సరే అలాంటివి ఏమీ లేవు అని బుకాయిస్తూ పార్టీ ఆ కార్యక్రమాన్ని మమ అనిపిస్తూ వస్తోంది. గడపగడపకు కార్యక్రమం ఇంకా పూర్తికాకముందే గృహసారథుల ద్వారా వాలంటీర్లను వాళ్లకు జతచేసి ఇంటింటికి తిరిగి మరో కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. అయితే ప్రజల వద్దకు వెళ్లిన వాలంటీర్లు చెప్పే మాటలు వినడానికే ఆసక్తి చూపని వాళ్లు.. తమ ఇంటి వాకిట గోడకు లేదా తలుపుకు జగనన్న స్టిక్కర్ అంటిస్తామంటే తోసిపుచ్చుతున్నారు. ప్రజల అనుమతితో మాత్రమే స్టిక్కర్ అంటించాలని పార్టీ పేర్కొంది. కానీ వాలంటీర్లు ప్రజలను బతిమాలి అయినా సరే వారి వాకిట స్టిక్కర్ అంటించి వెళుతున్నారు. ఆ నాయకులు బయటకు వెళ్ళగానే ప్రజలు ఆ స్టిక్కర్ను పీకి పడేస్తున్నారు. ఇలా దాదాపుగా ప్రతిచోటా వైఎస్ఆర్ కాంగ్రెస్కు ప్రతిఘటనలు మాత్రమే ఎదురవుతున్నాయి.
అయితే వాలంటీర్లు నమోదు చేస్తున్న సర్వేలో వ్యతిరేక అభిప్రాయాలు తెలియజేసిన ప్రజల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. ప్రజల్లో తమ పరిపాలన పట్ల వ్యతిరేకత ఉన్నదా సానుకూలత ఉన్నదా అనే సంగతిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండడం చాలా మంచిదే. కానీ తమ దృష్టికి వచ్చిన వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి వారి అసంతృప్తులు తగ్గేలాగా పాలనను మెరుగుపరుచుకోవడానికి ఇది ఉపయోగపడితే బాగుంటుంది. అలా కాకుండా వ్యతిరేకతను తెలియజేసిన వారిని శత్రువులుగా భావిస్తూ వారి మీద కక్ష కట్టడానికి ఈ సర్వేలను మార్గంగా ఎంచుకుంటే దారుణంగా ఉంటుంది.
ఇప్పుడు జగన్నే మా భవిష్యత్తు అంటూ సాగిస్తున్న సర్వేలలో వ్యతిరేకతను తెలియజేసిన వారి పరిస్థితి ఏమవుతుంది అనే భయం ప్రజల్లో ఉంది. వారి మీద ప్రభుత్వం కక్షగట్టి ఇప్పటిదాకా అందుతూ వచ్చిన పథకాలను రాబోయే ఏడాదిలో నిలిపివేస్తుందా? లేదా వారి వ్యతిరేకతకు గల కారణాలను మరింత లోతుగా తెలుసుకుని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తుందా? లేదా వారందరి పేర్లను ఓటర్ల జాబితా నుంచి ఏదో ఒక సాకుతో తొలగించడానికి కుట్ర రచిస్తుందా అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. తమ పార్టీ కాని వారు ఎవరో పక్కాగా తెలుసుకుని ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లను మాయం చేయడానికి ఈ కుట్ర జరుగుతున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరి జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఈ సర్వే వివరాలను ఏరకంగా వాడుకుంటుందో వేచి చూడాలి.