వృద్ధులకు ఇచ్చే పెన్షనును 2000 నుంచి 3000 చేస్తానని ప్రకటించడం ద్వారా.. జగన్ గత ఎన్నికల సమయంలో వయోధికులైన వారి ఓట్లను కొల్లగొట్టారు. ప్రతి అవ్వకు ప్రతి తాతకు తాను మనవడిని అవుతానని కూడా ఆయన చెప్పుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ పెంచడం అనేది విడతల వారీగా చేస్తూ రాజకీయ ఎత్తుగడగా దానిని మార్చారు. ఎన్నికలు జరిగే సంవత్సరం నాటికి పూర్తిగా పెంచేలా.. 2024 ఎన్నికల ప్రచారానికి వెళ్లే సమయానికి మీకు హామీ ఇచ్చినట్లుగా పెన్షను 3000 చేసేశా అని చెప్పగలిగేలా.. ఆయన ఏడాదికి 250 రూపాయలు మాత్రం పెంచుతున్నారు. అయితే ఇదే సమయంలో పెంచుతున్న ప్రతి సందర్భంలోనూ పెన్షన్లకు అర్హులైన వృద్ధుల జాబితాలో కోతలు పెట్టడానికి కొత్త కొత్త నిబంధనలను తీసుకు వస్తుండడమే చాలా విమర్శలకు గురవుతోంది.
తాజాగా వచ్చే ఏడాది జనవరి నుంచి వృద్ధుల పెన్షన్లు 2750 కాబోతున్నాయి. దీనికి సంబంధించి సీఎం ఆల్రెడీ అధికారిక ప్రకటన చేశారు. ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇదే సమయంలో లబ్ధిదారుల జాబితాలో కోత పెట్టడానికి కొత్త నిబంధనలు కూడా జత అవుతున్నాయి. వెయ్యి చదరపు అడుగుల నివాసస్థలం ఉన్నవారు, 300 యూనిట్లు దాటి విద్యుత్తు బిల్లులు చెల్లించే వారికి పెన్షన్ కోసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలో దాదాపు 10 నుంచి 20 శాతం మంది పెన్షనర్ల మీద ప్రభావం చూపిస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.
గ్రామాలు, చిన్న చిన్న పట్టణాల్లో పలువురికి ఇంటి స్థలాలు పెద్దవిగానే ఉంటాయి. అలాగే కరెంటుతో వాడే ఇస్త్రీపెట్టె ఉపాధిగా బతుకుతున్న వారికి కూడా 300 యూనిట్ల కంటె ఎక్కువే కరెంటు కాలుతుంది. అలాంటి ఆస్తులు ఏ అవ్వ పేరుమీదనో, తాత పేరుమీదనో ఉన్నదంటే.. వారికిక పెన్షన్ కట్ అయినట్టే. మన గ్రామీణ వ్యవస్థలో కుటుంబ పెద్ద మగ అయితే అతని పేరు మీద, లేదా అతని భార్య పేరు మీద ఆస్తి ఉంటుంది. వార్ధక్యం వచ్చినా సరే.. వారు చనిపోయే దాకా వారి పేరుమీదనే ఉంటుంది. చనిపోయిన తర్వాతే పిల్లలు పంచుకోవడం జరుగుతుంటుంది. ముసలితనం వల్ల ఇంట్లో నిర్ణయాధికారం తగ్గిపోయి, నీరసించి, ఇబ్బందులు పడుతూ ఉన్నా సరే.. నామ్ కే వాస్తే గా ఆస్తి మాత్రం వారి పేరిట ఉంటుంది. అయితే అలాంటి ఆస్తి వారికి ఇప్పుడు గుదిబండ కాబోతోంది.
అవ్వ, తాతల పేరు మీద వెయ్యి అడుగుల నివాసస్థలం ఆస్తిగా ఉంటే వారికి పెన్షను కోసేయబోతున్నారు. పెన్షను పెంచుతున్నట్టే బిల్డప్ ఇస్తూ అడ్డంగా లబ్ధిదారుల్లో కోత పెట్టడం దారుణం అని ప్రజలు వాపోతున్నారు. దీనివల్ల లక్షలాది మంది వృద్ధుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని ఆవేదన చెందుతున్నారు.
అవ్వ పేరుతో ఆస్తి ఉంటే అంతే సంగతులు!
Saturday, January 18, 2025