ఒకవైపు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన సీబీఐ ఎదుట విచారణ నిమిత్తం హాజరు కావాలి. ఈలోగా తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ను మధ్యాహ్నం రెండున్నర గంటలకు విచారించాలని హైకోర్టు నిర్ణయించింది. తన తండ్రిని కూడా వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపిస్తూ సీబీఐ ఆరెస్టు చేసిన నేపథ్యంలో.. తనను కూడా అరెస్టు చేస్తారని, సోమవారం మధ్యాహ్నం విచారణ ముగిసిన తర్వాత అరెస్టు చేస్తున్నట్లుగా ప్రకటిస్తారేమోననే భయం అవినాష్ లో ఉన్నట్లుగా కనిపిస్తోంది.
భాస్కర్ రెడ్డి అరెస్టు తర్వాత.. అవినాష్ అసహనానికి గురైన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆయన సీబీఐ విచారణ చేస్తున్న కొత్త బృందం మీద కూడా విపరీతంగా చిందులు తొక్కుతున్నారు. ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దీనినంతా తెరవెనుక నుంచి బిజెపి నడిపిస్తున్నదని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ కీలక నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. జగన్ మాట్లాడక పోయినప్పటికీ.. వైసీపీ ప్రముఖులు అనేకులు బిజెపి మీద కూడా నిందలు వేస్తుండడం గమనించాల్సిన విషయం.
ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావడానికి హైదరాబాదు వచ్చిన అవినాష్ రెడ్డి, తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం కోర్టు గడప తొక్కారు. తండ్రి అరెస్టు, తన మిత్రుడు ఉదయకుమార్ రెడ్డి అరెస్టు తర్వాత తన అరెస్టు కూడా అనివార్యంగా జరుగుతుందనే భయం అవినాష్ లో అణువణువునా కనిపిస్తున్నట్టుంది.
నలుగురు వ్యక్తులు వివేకాను కొట్టి చంపుతుండగా తాను స్వయంగా చూశానని వాచ్ మెన్ రంగన్న చెప్పిన తర్వాత.. ఆ నలుగురినీ అరెస్టు చేసిన తర్వాత.. వారిలో ఒకరిని అప్రూవర్ గా మార్చడాన్ని అవినాష్ రెడ్డి తప్పుపడుతున్నారు. ఏ4గా ఉన్న నిందితుడే అప్రూవర్ గా మారి వెల్లడించిన వివరాలేవీ నిలబడవని తమ నిజాయితీ, మంచితనం ఎప్పటికైనా బయటకు వస్తాయని అంటున్నారు.
పోలీసులకు తానే సమాచారం ఇచ్చాను గనుక.. తనకు నేరంతో సంబంధం లేదనేది అవినాష్ రెడ్డి క్లెయిం చేస్తున్న మాట. ఈ వాదన కోర్టు ఎదుట ఎంత దూరం నిలబడుతుందో చెప్పలేం. ఈ పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరిస్తే గనుక.. అవినాష్ అరెస్టు కూడా ఇవాళే (సోమవారం) జరుగుతుందనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.
అవినాష్ లో అణువణువునా అరెస్టు భయం!
Saturday, January 18, 2025