‘తనను ఉద్దేశపూర్వకంగా వివేకానందరెడ్డి హత్య కేసులో ఇరికిస్తున్నారనేది’ అవినాష్ రెడ్డి వాదన. ఆయన ఏం మాట్లాడినా ఆ వాదనకు అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు. గూగుల్ టేకౌట్ వివరాలను ఎద్దేవా చేసినా, సీబీఐ కుట్ర చేస్తున్నదని నిందలు వేసినా.. అన్నీ తదనుగుణంగానే! అలాంటి అవినాష్ రెడ్డి ఇటీవలి కాలంలో.. హత్య జరిగిన నాడు వైఎస్ వివేకా రాసినట్టుగా చెబుతున్న లేఖ గురించి పదేపదే ప్రస్తావిస్తున్నారు. హత్యాస్థలంలో జరిగిన లేఖ గురించి సీబీఐ దర్యాప్తు చేయకుండా.. సీబీఐ తనను ఇరికిస్తున్నదనేది ఆయన ప్రధాన ఆరోపణల్లో ఒకటి. ఇదే విషయాన్ని ఆయన హైకోర్టులో కూడా నివేదించారు. అయితే ఆ లేఖ గురించి హైకోర్టుకు నివేదించడం ద్వారా అవినాష్ రెడ్డి తనను తాను మరింత లోతుగా ఈ కేసులో ఇరికించేసుకున్నారా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మొదలైంది.
అవినాష్ రెడ్డి హత్యాస్థలంలో లేఖ గురించి పదేపదే ప్రస్తావించారు. అయితే ఆ లేఖను వివేకానందరెడ్డితో బలవంతంగా రాయించినట్లుగా ఫోరెన్సిక్ నివేదికలో తేలినట్లు సీబీఐ ఆల్రెడీ పేర్కొంది. లేఖ బలవంతంగా బనాయించినదిగా నిరూపణ అయిందంటే.. అది కూడా అవినాష్ రెడ్డి ప్రేరేపిత వ్యక్తుల పనే అనే సంగతి తేలుతుంది. ఎట్ లీస్ట్ ఆ అనుమానాలు కూడా వారి మీదకే మళ్లుతాయి.ఆ ముందుచూపు కూడా లేకుండా ఆయన దాన్ని గురించి పదేపదే అడిగారు.
తీరా సీబీఐ ఇప్పుడు ఆ లేఖను కూడా హైకోర్టుకు సమర్పించేసింది. ఈ నేపథ్యంలో లేఖ బలవంతంగా రాయించినదని తేలితే అది ప్రస్తుత అనుమానితులకు మరింత ఇబ్బందికరం అవుతుంది.
మరోవైపు వివేకా కూతురు సునీత వేసి ఇంప్లీడ్ పిటిషన్ లోని వివరాలు కూడా అవినాష్ కు వ్యతిరేకంగా కీలకం కానున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతానికి తాము తీర్పు ఇచ్చే వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని మాత్రమే హైకోర్టు ఆదేశించింది. మంగళవారం విచారణకు రావాల్సిందిగా సీబీఐ పిలిస్తే, తనకు వీలుపడదని మరోసారి వస్తానని అవినాష్ రెడ్డి జవాబు పంపారు. నిజానికి మంగళవారం విచారణకు వస్తే, కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన అరెస్టు అయ్యే చాన్స్ లేదు. తదుపరి ఆయన విచారణకు వచ్చేలోగా కోర్టు తీర్పు వచ్చేస్తే అరెస్టు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. మొత్తానికి వివేకా పేరుతో హత్యాస్థలంలో దొరికిన లేఖ గురించి అతిగా కెలకడం ద్వారా.. అవినాష్ రెడ్డి తనను తాను ఇరికించుకున్నట్టే అవుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.
అవినాష్ రెడ్డి తనను తానే ఇరికించుకున్నారా?
Thursday, December 19, 2024