విచారణ ఆలస్యం అవుతోందంటే ప్రతి సందర్భంలోనూ విచారణాధికారి తప్పు అయి ఉండాల్సిన అవసరం లేదు. కానీ.. రకరకాల ఆరోపణలతో కోర్టు ద్వారా విచారణాధికారిని కూడా తప్పించారు. అధికారి మారినంత మాత్రాన వాస్తవాలు ఎలా మారిపోతాయి.. అనే అభిప్రాయం కలిగించేలాగా.. ఇప్పుడు అనుమానాలు మరింత గట్టిగా వైఎస్ అవినాష్ రెడ్డి వైపే వేలెత్తి చూపిస్తున్నాయి. అవినాష్ ఆప్త మిత్రుడిని అరెస్టు చేసిన సీబీఐ పదిరోజుల తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టుకు వెల్లడించిన వివరాలు అవినాష్ రెడ్డి పాత్రను మరింత ధ్రువపరిచేవిధంగానే ఉన్నాయి.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి దర్యాప్తు సుదీర్ఘకాలంగా సా..గుతూనే ఉంది. సీబీఐ విచారణాధికారులను చంపుతామని బెదిరించిన సంఘటనలు కూడా ఉన్నాయి. కోర్టుల జోక్యంతో విచారణ పర్వం మొత్తం కడపనుంచి హైదరాబాదుకు మారింది. ఇలాంటి పరిణామాలు ఎన్ని జరిగినప్పటికీ అందరి అనుమానాలు కడప ఎంపీ అవినాష్ రెడ్డి మీద ఉండడం విశేషం. సీబీఐ దర్యాప్తులో ఒక్కొక్కరుగా వెల్లడిస్తూ వచ్చిన వాంగ్మూలాలన్నీ ఆయనకు ప్రతికూలంగానే ఉన్నాయి.
అవినాష్ రెడ్డి కి అనుయాయులుగా పేరుపడిన చాలా మందిని విచారించిన తర్వాత.. ఆయన మిత్రుడు ఉదయకుమార్ రెడ్డిని అరెస్టు చేసిన వారు సమగ్రంగా దర్యాప్తు చేయడానికి పదిరోజుల కస్టడీకి అడుగుతున్నారు. ఉదయకుమార్ రెడ్డికి హత్య గురించి ముందే తెలుసునని, రెండు మూడు నిమిషాల వ్యవధిలో అవినాష్ ఇంట్లో, వివేకానందరెడ్డి ఇంట్లో ఉదయకుమార్ ఉన్నాడని సాక్ష్యాలు సహా నిరూపించింది. ఉదయ్ కుమార్ రెడ్డి స్వయంగా సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో ఉదయకుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించాడనేది సీబీఐ చెబుతున్నమాట. గొడ్డలి వేటుకు బలైన వైఎస్ వివేకానందరెడ్డి తల గాయానికి, స్వయంగా తన తండ్రి గజ్జల జయప్రకాశ్ రెడ్డిని పిలిపించి ఆయనతోనే బ్యాండేజ్ కట్టించినట్టుగా కూడా చెబుతున్నారు. సహజంగానే ఈ కేసుకు సంబంధించి చాలా మంది నిందితుల తరహాలోనే గజ్జల ఉదయకుమార్ రెడ్డి కూడా విచారణకు సహకరించడం లేదని సీబీఐ చెబుతోంది. సమాధానాలు దాటవేస్తున్నారని, పొంతనలేని జవాబులు చెబుతున్నారని ఆరోపిస్తుంది. పూర్తిస్థాయిలో ఆయననుంచి వివరాలు రాబట్టాలంటే పదిరోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరుతోంది.
విచారణాధికారులైతే మారారు గానీ.. అవినాష్ రెడ్డి చుట్టూ బలపడుతున్న అనుమాన మేఘాలు తొలగిపోలేదు. ఉదయకుమార్ రెడ్డిని కస్టడీకి ఇవ్వడం అంటూ జరిగితే, బయటకు రాగల కొత్త వివరాలు ఏమైనా ఉంటాయా? ఇప్పటిదాకా చెబుతున్న హత్యక్రమాన్ని సీబీఐ మరింత గట్టిగా ధ్రువపరుస్తుందా అనేది వేచిచూడాలి.
అవినాష్ చుట్టూ గట్టిగా బిగుస్తున్న ఉచ్చు!
Wednesday, December 18, 2024