ఒకవైపు 250 రూపాయలు పెన్షన్ పెంచినట్టే పెంచుతూ మరొకవైపు లబ్ధిదారులను కోసేస్తున్నారనే సమాచారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. పార్టీలు టేకప్ చేయకపోయినా.. గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతున్న ఈ వ్యవహారం గురించి, పెన్షన్ లబ్ధిదారులకు ఇచ్చిన నోటీసుల గురించి.. సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అధికారుల వద్దకు, ఎమ్మెల్యేల వద్దకు జనం పోటెత్తుతున్నారు. ప్రభుత్వం పరువు పోయే పరిస్థితి కనిపిస్తుండడంతో.. జగన్ నష్టనివారణ చర్యలు చేపడుతున్నారు. ఈ సీజనులో ఎక్కడ ఏ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చినా కూడా.. ప్రత్యర్థులను తిట్టడంతో పాటుగా.. పెన్షనర్లలో కోత గురించి కూడా మాట్లాడుతున్నారు.
ఇది చాలా సాధారణ ప్రక్రియ అని.. ప్రతి ఆరునెలలకు ఓసారి పెన్షన్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుందని, ఆ ప్రక్రియపై దుష్ప్రచారం సాగుతోందని అంటున్నారు. యెల్లో మీడియాను ఆయన దుమ్మెత్తిపోస్తున్నారు.
పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఉండాల్సిందే. కొన్ని నిబంధనలు, అర్హత నియమాల ప్రకారం పేదలు పెన్షను పొందుతున్నప్పుడు.. వారు అదే స్థాయిలో ఉన్నారో, లేదా వారి పరిస్థితిలో మార్పు వచ్చిందో ప్రతి ఆరునెలలకు ఓసారి చెక్ చేయడం మంచిదే. అయితే పెన్షను పొందగల అర్హతల పరిధిలోకి కొత్తగా వచ్చి చేరే వారుకూడా ఉంటారు కదా. కొత్తగా చేరే వారి జాబితాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారా? లేదా, ఆరునెలలకు ఓసారి అప్డేట్ చేస్తారా? అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం. ఆరునెలల వ్యవధిలో కొందరు అర్హతలను దాటిపోయి సంపన్నులుగా మారి ఉండొచ్చు. వారికి పెన్షను తొలగిస్తారు సరే. అదే ఆరునెలల వ్యవధిలో పెన్షను పరిధిలోని వయసుకు చేరుకునే వారు కొత్తగా ఉంటారు. కొత్తగా వైధవ్యం పొందిన వారుంటారు. వారితో జాబితా అప్ డేట్ అవుతుండాలి. ఈ ప్రక్రియ మొత్తం నిజాయితీగా జరుగుతున్నట్టయితే.. జగన్ పెన్షన్ వెరిఫికేషన్ గురించి సుద్దులు చెప్పడం సాధ్యం అవుతుంది. అలాంటప్పుడు ఆయన పెన్షన్ వెరిఫికేషన్ చేస్తూ.. ఆరునెలలకు ఓసారి ఎందరిని జాబితానుంచి తొలగిస్తున్నారో చెప్పడంతో పాటు, అదే ఆరునెలల వ్యవధిలో కొత్తగా ఎంతమందికి పెన్షన్లు మంజూరయ్యాయో కూడా గణాంకాల సహా వివరిస్తే గనుక.. ప్రజలు ఆయన చిత్తశుద్ధిని అర్థం చేసుకుంటారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పేదలకు అండగా నిలవడం మీదనే జగనన్న శ్రద్ధ పెడుతున్నారని నమ్ముతారు. అలా కాకుండా.. ప్రతి నియోజకవర్గంలోనూ వేలసంఖ్యలో పెన్షనర్లకు నోటీసులు ఇచ్చేసి, ఆ విషయం ఎత్తిచూపిన మీడియా మీద అక్కసు వెళ్లగక్కుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజానికి అర్థసత్యాలతో మభ్యపెట్టాలని చూస్తున్నారు. ‘అశ్వత్థామ హతః.. కుంజరః’ అనే రీతిగా ఆయన నయావంచన మార్గాన్ని అనుసరిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.
అర్థసత్యాలతో ‘జగన్’మాయ ఎందుకు?
Wednesday, January 15, 2025