అర్జంటుగా పట్టాలిచ్చేద్దాం.. తర్వాత చూద్దాం!

Monday, September 16, 2024

రాజధాని అమరావతి ప్రాంతంలో ఆర్ 5 జోన్ గా ప్రకటించి.. అక్కడ రాజధాని నిర్మాణం కోసం రైతులు కేటాయించిన భూములను ఇతర ప్రాంతాలకు చెందిన పేదలకు కేటాయించే ప్రక్రియకు కోర్టు పరంగా కొంత వరకు ఆటంకం తొలగినట్టే. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ అమరావతి రైతులు హైకోర్టులో వేసిన పిటిషన్ లో ఆశించిన తీర్పు రాలేదు. రైతులు కోరుతున్నట్టుగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో పేదలకు ప్రబుత్వం పట్టాలు ఇవ్వడానికి మార్గం సుగమం అయింది.
అయితే ఈ తీర్పుపై రైతులు సుప్రీం కోర్టుకు వెళ్తున్నారు. ఆ నేపథ్యంలో మళ్లీ అక్కడినుంచి బ్రేకులు పడేలోగా.. మరో పదిరోజుల వ్యవధిలోనే లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలు పంచేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. ముందు పట్టాలు పంచేస్తే , తర్వాత సుప్రీం నుంచి స్టే వచ్చినా కూడా.. అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చునని సర్కారు అనుకుంటోంది.
నిజానికి పేదలకు పట్టాలు ఇవ్వవచ్చు గానీ.. ఆ వ్యవహారం హైకోర్టు ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉండాలని కూడా హైకోర్టు చెప్పింది. అంటే, వైసీపీ మరీ అంతగా పండగ చేసుకునే వ్యవహారమేమీ కాదిది. తుది తీర్పు అనేది ప్రభుత్వ ఉత్తర్వులకు భిన్నంగా వచ్చినా ఆశ్చర్యం లేదు. అయితే, పట్టాలు ఇవ్వడం ద్వారా పేదలకు లబ్ధి చేయాలని, న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలనే సంకల్పం ప్రభుత్వానికి ఎంతమాత్రమూ లేదు. ముందు పట్టాలు ఇచ్చేయాలి. తర్వాత ఏదైనా చిక్కులు వస్తే చంద్రబాబు కుట్ర అంటూ అతని మీదకు నెట్టేయాలని అని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఉంది.
అందుకే ఒకవైపు రైతులు సుప్రీంను ఆశ్రయిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం పట్టాల పర్వాన్ని పూర్తిచేసేస్తున్నారు.
నిజానికి అమరావతి రాజధాని విషయంలో ప్రభుత్వం అనుసరించే ద్వంద్వ ప్రమాణాలకు ఇది నిదర్శనం. అక్కడ సగం పూర్తయిన నిర్మాణాలన్నీ ఆరునెలల్లో పూర్తిచేయాలి అని అదే హైకోర్టు చెబితే ఇప్పటిదాకా పట్టించుకోలేదు. కానీ, పేదల పట్టాల విషయంలో ఇచ్చిన తీర్పును మాత్రం ఆగమేఘాల మీద అమలు చేస్తున్నారు. మరి ఇది వైసీపీ సర్కారు రెండు రకాల వ్యవహార సరళి కాక మరేమిటి? అని ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles