అరెస్టు తప్పదు.. ఏం సాధించడానికి హైడ్రామా?

Wednesday, January 22, 2025

సీబీఐతో దోబూచులాట వ్యవహారంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తప్పుటడుగులు వేస్తున్నారా? అనే విశ్లేషణ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తాజా పరిస్థితిని గమనిస్తే.. సోమవారం నాడే అవినాష్ అరెస్టు జరుగుతుందని రోజంతా బాగా ప్రచారం జరిగింది. అవినాష్ రెడ్డిని తమకు లొంగిపోమని సూచించాల్సిందిగా సీబీఐ అధికారులు కర్నూలు ఎస్పీకి లేఖ రాయడం జరిగింది. అవినాష్ తల్లి శ్రీలక్ష్మి చికిత్స పొందుతున్న విశ్వభారతి హాస్పిటల్ పరిసరాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. సీబీఐ అధికారులు కూడా కర్నూలు చేరుకున్న తరువాత, అరెస్టు తప్పదని అనుకుంటుండగా.. అవినాష్ మరోమారు సుప్రీంను ఆశ్రయించారు.
తల్లి అనారోగ్యం కారణంగా.. వారం రోజుల పాటు తనను విచారణకు కూడా పిలవకుండా సీబీఐను ఆదేశించాలనేది ఆయన ఒక కోరిక. అలాగే.. బెయిల్ పిటిషన్ విచారిస్తున్న హైకోర్టు బెంచ్ తన వాదనలు వినేవరకు అరెస్టు జరగకుండా ఆదేశించాలనేది రెండో కోరిక! వీటిపై సుప్రీం మంగళవారం విచారణ జరపనుంది.
అయితే అవినాష్ రెడ్డి మాటిమాటికీ కోర్టులను ఆశ్రయించడం ద్వారా.. తప్పటడుగులు వేస్తున్నారా అనే చర్చ ఇప్పుడు రేకెత్తుతోంది. విచారణకు పిలిచిన ప్రతిసారీ ఏదో ఒక సాకులు చెప్పడం, అరెస్టు చేస్తారనే భయంతో కొత్త పితలాటకాలు పెట్టడం వంటి పనుల వలన, తన మీద ప్రజల్లో మరింతగా అనుమానాలు పెరిగే వాతావరణాన్ని అవినాష్ తయారుచేస్తున్నారు.
అవినాష్ సుప్రీం తలుపు తట్టిన రెండు కోరికలు యథాతథంగా నెరవేరాయని అనుకుందాం. తల్లి అనారోగ్యం పేరు మీద వారం రోజులు విచారణకు పిలవరు. హైకోర్టు ఆయన బెయిల్ పిటిషన్ వినేదాకా అరెస్టు చేయరనే అనుకుందాం.. కానీ దానివల్ల ఆయనకు ఏం ఒరుగుతుంది. మహా అయితే తల్లి అనారోగ్యం పేరు మీద వారం రోజులు, బెయిల్ పిటిషన్ పేరు మీద అదనంగా మరో నాలుగైదు రోజులు వెనక్కు నెట్టగలరు తప్ప.. అవినాష్ పూర్తిగా సీబీఐ అరెస్టును తప్పించుకోగల అవకాశం ఉన్నదా? అనే సందేహం ప్రజలకు కలుగుతోంది.
సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లలోని వివరాల ప్రకారం.. వివేకా హత్య వెనుక కీలకంగా అవినాష్ హస్తం ఉన్నదనే.. విచారణ అధికారులు నమ్ముతున్నారు. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను అరెస్టు చేసి తీరుతారు. సుప్రీం తలుపు తట్టకుండా ఉంటే సోమవారమే ఆయన అరెస్టు జరిగి ఉండేది. అవినాష్ తన పరువు బజార్న పడేసుకుంటూ మరింతగా ఈ వ్యవహారాన్ని రచ్చరచ్చ చేస్తున్నారు. గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెస్తున్నారు.
ప్రస్తుతం విచారణ ఉన్న పరిస్థితిలో, దశలో అవినాష్ కు బెయిలు వస్తుందనుకోవడం భ్రమ. ఆల్రెడీ బెయిలుమీద ఉన్నవారిని కూడా తిరిగి కస్టడీలోకి తీసుకుని.. అనుమానితులు/నిందితులు అందరినీ కలిపి ఒకేసారి విచారించి సంగతేంటో తేల్చేయాలని సీబీఐ చాలా పట్టుదలగా ఉంది. ఇలాంటప్పుడు అవినాష్ కు ముందస్తు బెయిల్ దొరకడం అసాధ్యం. అరెస్టు తప్పదు. ఇలా నాటకాలు ఆడుతున్నారని జనం నిందలువేసేలా ప్రవర్తించే బదులు, తాను తప్పు చేయలేదని నమ్ముతున్న నాయకుడిగా.. విచారణకు అవినాష్ సహకరిస్తే ఎంతో బాగుంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles