2019లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నాటినుంచి.. జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీయాత్రచేసి ఉంటారు. ఈ గణాంకాలను బయటకు తీసి, అప్పటిునంచి ఇప్పటిదాకా ఢిల్లీ పెద్దలకు ఏయే పనుల గురించి విన్నవించుకుంటున్నారు.. అని గమనిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతంది. తొలినాటినుంచి ఇప్పటిదాకా ఆయన ఢిల్లీయాత్రల్లో ఒకటే రికార్డును ప్లే చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇదే గ్రామ్‌ఫోను రికార్డు అయితే ఇన్నిసార్లు ప్లే చేసినందుకు ఎప్పుడో అరిగిపోయి ఉండేది. ఈ రోజుల్లోని డిజిటల్ డిస్క్ ను ప్లే చేసినా కూడా అరిగిపోతుంది. అందుకే ఆయన ఢిల్లీ యాత్రల మీద ప్రజలకు అనేక రకాల సందేహాలు పుడుతుంటాయి.
జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ.. ప్రధానినో, హోంమంత్రినో కలిసిన తర్వాత.. ఒక ప్రెస్ నోట్ విడుదల చేస్తారు. లేదా, ఆయన ప్రతినిధులు భేటీ వివరాలను మీడియాకు లీక్ చేస్తారు. ప్రతిసారీ అందులో ఉండేది ఒక్కటే. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వమని అడిగారు. పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయడం గురించి విన్నవించారు. విభజన చట్టంలో నేటికీ అపరిష్కృతంగా ఉన్న అంశాలను సరిచేయాలని కోరారు.. ఇవే పాయింట్లు. బహుశా జగన్ ఢిల్లీ యాత్ర తర్వాత పత్రికల్లో ఏం వార్త వస్తుందనే సంగతి.. రాష్ట్ర ప్రజలకు కూడా కంఠతా వచ్చేసి ఉంటుందేమో. విభజన జరిగి ఎనిమిదేళ్లు దాటుతోంది. జగన్ సర్కారు ఏర్పడి మూడున్నరేళ్లు అవుతోంది. ఇంకా అవే డిమాండ్లను ప్రతిసారీ వినిపించడం అంటే.. జగన్ తన పదులసంఖ్యలోని ఢిల్లీ యాత్రల వలన ఇప్పటిదాకా ఏం సాధించినట్టు? ఇది ప్రజలకు మెదలుతున్న పెద్ద సందేహం.
ఈ ఢిల్లీ యాత్ర హటాత్తుగా ఏర్పాటైంది. ఎందుకంటే.. 28న ఆయన వేరే అధికారిక కార్యక్రమాలు పెట్టుకున్నారు. కానీ, ఢిల్లీ యాత్ర ఫిక్సయ్యాక ఆ కార్యక్రమాలను మార్చుకున్నారు. అంటే ఇది హఠాత్తుగా పెట్టుకున్నారని తెలుస్తోంది. అలా ఉన్నపళంగా ఢిల్లీ వెళ్లే అవసరం ఏమొచ్చింది. మూడున్నరేళ్లుగా చేతకాని అంశాల్ని మరోసారి నివేదించడానికి అంత హటాత్తుగా వెళ్లాలా? అనేది ఇంకో సందేహం.
సాధారణంగా నాయకులు వెళ్లి ఢిల్లీ పెద్దలను కలిసిన తర్వాత.. అందులో పరిష్కారం కాగల సానుకూల అంశాలు ఉంటే భేటీ తర్వాత ఉభయులూ కలిసి ఓ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు చెబుతారు. కనీసం ఢిల్లీ పెద్దలు ట్వీట్లయినా చేస్తారు.. ఫలానా అంశంపై భేటీ అయిందని అందులో పేర్కొంటారు. కానీ.. జగన్ ఢిల్లీ వెళ్లిన ఏ సందర్భంలోనూ ఇలాంటి ఉభయుల ప్రెస్ మీట్ జరగనేలేదు. జగన్ హోదా అడుగుతున్నట్టుగా ఏ ఢిల్లీ పెద్దలు కూడా ఎన్నడూ ట్వీట్ కూడా చేయలేదు. మరి జగన్ ప్రతిసారీ వారిని ఏం అడుగుతున్నారు. ఇది ప్రజలకు మరో సందేహం.
అందుకే.. జగన్ తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకోవడానికి, తన తమ్ముడు అవినాష్ రెడ్డిని బాబాయి వివేకానందరెడ్డిని హత్యచేశారన్న ఆరోపణల నుంచి తప్పించడానికి జగన్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడనే విపక్షాల ఆరోపణలు కూడా జనం నమ్ముతున్నారు. ఈ ఢిల్లీ యాత్రలపై ఎప్పటికి స్పష్టతవస్తుందో గానీ.. ఈ యాత్రలో ప్రత్యేకంగా.. తమ రాష్ట్రం కొత్త అప్పులు చేసుకోవడానికి వీలుగు రుణపరిమితులు ఎత్తేయాలని ప్రధానిని కోరినట్లుగా కొత్త అంశం కూడా కనిపిస్తోంది.