భార్యా భర్తల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే.. వారు చట్టపరంగా విడాకులు తీసుకోవడం అనేది మోసం అవుతుందా? విడాకులు తీసుకున్నంత మాత్రాన తమ మాజీ భాగస్వామిని.. మిగిలిన శేషజీవితమంతా ద్వేషిస్తూనే గడపాలా? వారిలో ఉండే మంచిని మంచిగా చూసే అలవాటు ఉండకూడదా? వారిలోని మంచి లక్షణాలను గౌరవించకూడదా?.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యవహార సరళిని గమనిస్తే ఇలాంటి అనుమానాలు సవాలక్ష పుట్టుకొస్తాయి. ప్రధానంగా ఇలాంటి అనుమానాలు పుట్టించే మాటలు మాట్లాడడం ద్వారా.. మంత్రి అంబటి రాంబాబు జనం దృష్టిలో పలుచన అవుతున్నారు.
పవన్ కల్యాణ్.. రేణుదేశాయ్ తో విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలుసు. వారు విడివిడిగానే ఉంటున్నారు. పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల విషయాన్ని దెప్పిపొడవడం తప్ప.. ఆయన గురించి విమర్శించడానికి మరో పాయింట్ ఏమీ దొరకకుండా వైసీపీ నాయకులు బతుకీడుస్తుంటారు. అలాంటి వైసీపీ నాయకులకు.. రేణుదేశాయ్ స్వయంగా .. పవన్ కల్యాణ్ చిత్తశుద్ధి గురించి కితాబులు ఇచ్చి.. ఆయన సీఎంగా ప్రజలకు చక్కగా సేవలందించగలరని మాట్లాడడాన్ని వైసీపీ నాయకులు సహించలేకపోతున్నారు. తాను వేసిన వెకిలి వేషాలను.. సినిమాలో స్పూఫ్ గా వాడినందుకు.. పవన్ కల్యాణ్ మీద కౌంటర్ విమర్శలు చేయడం మొత్తం తనకు పేటెంట్ ఉన్నదని భావిస్తున్న మంత్రి అంబటి రాంబాబు.. రేణుదేశాయ్ వ్యాఖ్యల గురించి.. ఎద్దేవా చేస్తున్నారు. తనకు అన్యాయం చేసినా సరే.. హిందూ మహిళగా విశాల దృక్పథంతో తన కుమారుడి తండ్రి సీఎం కావాలని రేణు దేశాయ్ కోరుకోవడం సహజమని, అయినా ప్రజలు అవకాశం ఇవ్వరని అంటున్నారు. ‘నిన్ను మోసం చేసిన వాడు .. రాష్ట్రాన్ని మోసం చేయడా అమ్మా’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
అయినా విడాకులు తీసుకోవడం పవన్ చేసిన మోసం ఏముందో.. ఆమె ఏరకంగా అన్యాయానికి గురైందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇద్దరికీ ఇష్టం లేనప్పుడు చట్టబద్ధంగా విడాకులు తీసుకోవడం, కోర్టు ఆదేశించిన మేరకు భరణం చెల్లించడం అనేది మోసం, అన్యాయం ఎలా అవుతుంది? అని ప్రజలు అనుకుంటున్నారు. అయినా.. అవకాశం దొరికితే చాలు.. అరగంట తనతో గడిపి పోవడానికి రమ్మని మహిళలను రహస్యంగా ఆహ్వానించే వాళ్లకు చట్టబద్ధమైన విడాకులు కూడా మోసంగానే కనిపిస్తాయని జనం నవ్వుకుంటున్నారు.