‘ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే’ అనేది సామెత. అమ్మ ఎదుట తమ హోదాలు, ఆధిపత్యాలు ఏవీ పనికిరావు, పనిచేయవు. అమ్మ ముందు ఎవడైనా బిడ్డ మాత్రమే. ఆ అనుబంధం అలాంటిది. విముఖతలు, వైమనస్యాలు ఉంటే అవి తాత్కాలికంగా మాత్రమే ఉండాలి. కానీ.. వాటిని అలాగే కాపాడుకుంటూ దూరాలను కలకాలం పాటించడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ విషయంలో ఇలా అవుతోంది.
వైఎస్ జగన్ తల్లి, మొన్నమొన్నటి వరకు ఆయన పార్టీకి గౌరవాధ్యక్షురాలిగా కూడా ఉన్న విజయమ్మ ఇటీవలి కాలంలో జగన్ తో దూరం దూరం మెలగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వారి ఇడుపులపాయ ఎస్టేట్ లో జరిగిన క్రిస్ మస్ వేడుకల్లో కూడా ఈ విషయం చాలా స్పష్టంగా బయటపడింది. వైఎస్ఆర్ సమాధికి నివాళులు అర్పించడంలో, ఆయన విగ్రహానికి పూలమాల వేయడంలో తల్లీ కొడుకులు ఇద్దరూ వేర్వేరుగా ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
సాధారణంగా ఇడుపులపాయ ఎస్టేట్ లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించినప్పుడు.. విజయమ్మ కొడుక జగన్ కు కేక్ తినిపించడం లాంటి దృశ్యాలు ఇదివరలో ప్రముఖంగా మీడియాకు విడుదల అయ్యేవి. కానీ.. ఈ దఫా అలాంటి ఆత్మీయ సన్నివేశాలేమీ లేవు. ఆత్మీయ పలకరింపులు కూడా లేవు. జగన్ తన కుటుంబం, కొందరు మంత్రులు, సన్నిహితులతో సహా సహా హాజరు కాగా, కూతురు షర్మిల ప్రస్తుతం లండన్ కు వెళ్లడంతో విజయమ్మ కొందరు బంధువులతో కలిసి క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ నేపథ్యంలో తల్లీకొడుకుల మధ్య సన్నిగిల్లిన అనుబంధాలు మరోమారు ప్రజల దృష్టికి వస్తున్నాయి.
2019 ఎన్నికల తర్వాత.. జగన్ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లనుంచి.. విజయమ్మ ఆయన తీరుతో విభేదిస్తున్నట్టుగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. అమరావతి రాజధానిని మొత్తం శిథిలావస్థకు చేరుస్తున్న ప్రయత్నాన్ని కూడా ఆమె వ్యతిరేకించినట్లు అప్పట్లో చెప్పుకున్నారు. అమరావతిలో సగంలో ఉన్న నిర్మాణాలను ప్రభుత్వం వచ్చిన తొలిరోజుల్లోనే విజయమ్మ స్వయంగా తిరిగి చూసి, వాటిని వదిలేయడం కరెక్టు కాదని చెప్పినట్టుగానూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె పూర్తిగా తెలంగాణకే పరిమితం అయిపోయారు. కూతురు షర్మిల వైతెపా పార్టీ పెట్టిన తర్వాత.. ఆమెకు అండగా తిరుగుతున్నారు. ఈ ఏడాది వైసీపీ ప్లీనరీలో గౌరవాధ్యక్ష పదవికి కూడా రాజీనామా ప్రకటించేసి.. కొడుకు పార్టీతో ఉన్న చివరి బంధాన్ని కూడా తెంచుకున్నారు. ఇటీవలి తెలంగాణ రాజకీయ పరిణామాల్లో ‘ఏపీతో మాకు ఇంకేం సంబంధం’ అని కూడా వ్యాఖ్యానించారు. ఏపీతో మాత్రమే కాదు.. కొడుకుతో కూడా సంబంధం వద్దనుకుంటున్నారా? అనిపించేలా.. ఇడుపులపాయ క్రిస్మస్ వేడుకల్లో పరిణామాలు జరిగిపోయాయి.
అమ్మ, కొడుకు.. వేరువేరుగా వేడుకల్లో..
Sunday, January 19, 2025