అమ్మకు అన్నం పెట్టడు గానీ.. పిన్నికి పరమాన్నం పెడతాను అన్నాడట వెనకటికి ఓ మహానుభావుడు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళి కూడా అంతకు భిన్నంగా ఏమీ లేదు. ఆయన సొంత చెల్లెలితో తగాదా పెట్టుకున్నారు. మాటా మంతీ కూడా లేకుండా వైరం పెట్టుకున్నారు. కానీ.. ఇప్పుడు రక్షా బంధన్ పర్వదినం రాగానే.. తగుదునమ్మా అంటూ.. రాష్ట్రంలోని ప్రతి మహిళకు శుభాకాంక్షలు చెబుతున్నారు..అంటూ ప్రజలు విమర్శిస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్ రక్షాబంధన్ సందర్భంగా ఒక ట్వీట్ చేశారు. ‘‘ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞుడిని. మీ సంక్షేమమే లక్ష్యంగా మీ రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తూ మీకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తున్నాను!’’ అని జగన్ ట్వీట్ చేశారు. రక్షాబంధన్ పర్వదినం నాడు మంత్రి విడదల రజని సహా మరికొందరు మహిళా నాయకురాళ్లు జగన్ కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఇదంతా చాలా మామూలుగానే సాగిపోయింది. కానీ సొంత చెల్లెలి పట్ల జగన్ కు ఉన్న ప్రేమ ఎలాంటిది? ఎంత మోతాదులో ఉంది? అనేది మాత్రం ప్రజలకు సందేహంగానే మిగిలిపోతోంది.
జగన్ జైలు పాలైన సమయంలో ఆయన సొంత చెల్లెలు షర్మిల రాష్ట్రమంతా తిరుగుతూ, పాదయాత్రలు చేస్తూ.. ‘జగనన్న వదలిన బాణాన్ని నేను’ అని చెప్పుకుంటూ.. అసలు ఆ పార్టీని సజీవంగా ఉంచడానికి తన అష్టకష్టాలు పడింది. శక్తియుక్తులను ధారపోసింది. ఎన్నికల ప్రచారంలో ఎంతో చురుగ్గా పనిచేసి జగన్ తో సమానంగా పాటుపడింది. అయితే ఎన్నికల్లో నెగ్గి అధికారం చేజిక్కిన తర్వాత.. అన్న నుంచి ఆమెకు ఎదురైన నిరాదరణ.. ఆమెకు విరక్తిని పెంచింది. అసలు ఏపీ రాజకీయాలనే వదలి తెలంగాణకు పారిపోయేంత వైరాగ్యాన్ని కలిగించింది. మొన్నమొన్నటిదాకా తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా ఉన్న షర్మిల ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నారు.
ఆ రకంగా చెల్లెలి జీవితం మొత్తం గందరగోళం అయిపోవడానికి కారణభూతుడైన జగన్మోహన్ రెడ్డి.. ఏపీలో మాత్రం ప్రతి చెల్లికి, అక్కకు తాను అండగా ఉంటానని చెప్పడం.. కేవలం ఓటు బ్యాంకు రాజకీయం లాంటిదేననే విమర్శలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. సొంత చెల్లెలికి ఏమీ చేయని వాడు, ఊరుమ్మడి మహిళలకు ఏదైనా సరే చేసేస్తానని అనడం కేవలం అవకాశ వాద రాజకీయమే అని ప్రజలు విమర్శిస్తున్నారు.
అమ్మకు అన్నం పెట్టకుండా.. పిన్నికి పరమాన్నం..
Wednesday, January 22, 2025