‘అమ్మఒడి’లో నెక్ట్స్ కోత ఏంటో తెలుసా?

Tuesday, November 12, 2024

పాఠశాలకు వెళ్లి చదువుకునే పిల్లలు ఉన్న ప్రతి తల్లికీ ఏడాదికి 15వేల రూపాయలు ఆమె ఖాతాలో వేయడం అనే పథకాన్ని ‘అమ్మఒడి’ పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. దేశానికంతా ఆదర్శం కాగల అద్భుత పథకాన్ని తాము తీసుకువచ్చాం అని టముకు వేసుకున్నారు. తొలుత ప్రతి బిడ్డకు ఈ పథకం అందుతుందని అన్నారు. తర్వాత రేషన్ కార్డు మీద ఒక బిడ్డకు మాత్రమే అన్నారు. ఆ తర్వాత విమర్శలు వెల్లువెత్తే సరికి.. ఎందరు పిల్లలు చదువుతోంటే.. అందరికీ డబ్బు చెల్లిస్తాం అన్నారు. చెల్లించారు కూడా.. తర్వాత అందులో కోత పెట్టారు. రాష్ట్రంలో 82 లక్ష్లల మంది అర్హులైన విద్యార్థులుండగా, కేవలం 44 లక్షల మందికి మాత్రమే చెల్లిస్తున్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.
ఇదొక ఎత్తు అయితే.. అమ్మఒడి పథకంలో అనేక రకాల కోతలు వచ్చాయి. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ వంటి వసతుల కల్పనకు తల్లిదండ్రులే డబ్బులివ్వాలనే నియమం తెచ్చి.. వారికిచ్చే 14 వేలలో రెండు వేలు కోతపెట్టి, 13 వేలు మాత్రమే ఇస్తున్నారు.
ఇంకా కరెంటు బిల్లులు 300 యూనిట్లు దాటుతున్నాయనే మిషమీద మరో కోత పెట్టారు. వారందరికీ పథకాన్ని నిలిపివేశారు. 75 శాతం ఎటెండెన్సు లేనివారికి కూడా కోత పెట్టారు. అటెండెన్సుతో ముడిపట్టి.. విద్యాసంవత్సరం పూర్తయిపోయిన తర్వాత గడచిపోయిన ఏడాది తాలూకు డబ్బు ఇస్తున్నారు. ఇన్ని రకాల కోతల మధ్యలో ఏదో తూతూమంత్రంగా అమ్మఒడి అమలు అవుతోంది.
ఈ నేపథ్యంలో ఈ పథకంలోనే మరో కొత్త కోత పెట్టడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రెవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లను పేదవిద్యార్థులు పొందే అవకాశం ఉంది. ఇలా సీట్లు పొందిన వారికి ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుంది. అయితే తాజాగా అమ్మఒడి కింద ఇస్తున్న డబ్బులోంచే ఆ ఫీజులు చెల్లించాలని జగన్ ప్రభుత్వం ఓ ఉత్తర్వు తెచ్చింది. విద్యాహక్కు చట్టం కింద సీట్లు పొందిన వాళ్లు ప్రెవేటు స్కూళ్లలో ఫీజులు చెల్లించకపోతే గనుక.. తర్వాతి ఏడాది వారికి అందే అమ్మఒడినుంచి ఫీజు డబ్బు మినహాయించి ప్రభుత్వమే స్కూలుకు చెల్లిస్తుందని కూడా పేర్కొన్నారు.
అయితే ఇందులో ఇంకో మెలిక ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమ్మఒడి పథకంలో కొత్తగా కోత పెట్టడానికి రంగం సిద్ధమవుతోందని అంటున్నారు. ప్రస్తుతం ప్రెవేటుస్కూళ్లలో చదివే వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. అయితే.. ఇలాంటి ఏర్పాటు వల్ల సర్కారు బడులు దెబ్బతింటాయనే వాదన తొలినుంచి ఉంది. ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ.. ప్రస్తుతం ఆర్టీఈ కింద సీట్లు పొందిన వారికి అమ్మఒడినుంచి ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందని ప్రకటించడం వలన.. ఇంకో మెలిక కనిపిస్తోంది. కొంత కాలం తర్వాత.. ప్రెవేటు స్కూళ్లలో ఆర్టీఈ కింద సీట్లు పొందిన వారికి తప్ప మిగతా పిల్లలకు అసలు అమ్మఒడి వర్తించకుండా నిషేధిస్తారని పలువురు అంచనా వేస్తున్నారు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సర్కారు.. అలా ప్రెవేటు స్కూళ్లలో చదివే వారిలో కనీసం 75 శాతం మందికి అమ్మఒడి కత్తిరించడానికి కొత్తగా పావులు కదుపుతున్నదని పలువురు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles