ఆశ లావు.. పీక సన్నం.. అన్న సామెత చందంగా ఉంది, తెలంగాణలోని భారతీయ జనతా పార్టీ పరిస్థితి! మరియు, ఆ పార్టీ మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా పెట్టుకుంటున్న నమ్మకం!! ఎందుకంటే.. ఇప్పటికిప్పుడు తెలంగాణలో భాజపా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎంతమాత్రమూ లేదు. అయితే అమిత్ షా మాత్రం.. ఈ ఎన్నికల్లోనే కేసీఆర్ ను ఓడించేసి, భాజపా అధికారంలోకి వచ్చేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు. బలం తక్కువ, కోరిక జాస్తి అన్నట్టుగా ఆ పార్టీ వ్యవహారం ఉంది.
ఖమ్మం బహిరంగ సభ తర్వాత.. ప్రత్యేకంగా అమిత్ షా రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ సభ్యులతో సమావేశం అయ్యారు. దూకుడు పెంచాలని ఆయన వారితో అన్నారు. అసలే భాజపా.. గతంలో ఉన్న దూకుడు కూడా పలచబడిపోయి.. నీరసంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికిప్పుడు ఆయన వచ్చి దూకుడు పెంచండి అనగానే ఎలా పెంచేస్తారు? అసలు వారికి దూకుడు పెంచే ఉద్దేశం ఉందా.. అమిత్ షా మాటలను ఈ చెవితో విని, ఆ చెవితో వదిలేస్తారా? అనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి.
నిజం చెప్పాలంటే అమిత్ షాకు ఇంకా చాలా చాలా కోరికలు ఉన్నాయి. తెలంగాణలో భారాసకు ఏకైక ప్రత్యామ్నాయం భాజపా మాత్రమే అన్న నినాదం ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లాలట. భారాసకు ప్రత్యామ్నాయం మేమే.. అని నినాదం లాగా అరుచుకుంటూ రోడ్లలో తిరిగితే ప్రజలు నమ్ముతారా? ఆ విషయాన్ని ఆచరణలో కదా నిరూపించాల్సింది! ఆ స్పృహకూడా అమిత్ షాకు ఉన్నట్టు లేదు. తమ పార్టీని బలోపేతం చేసి.. ఆ భావన ప్రజల్లో తీసుకురావాలని చెప్ని ఉంటే బాగుండేది. అయితే.. కాంగ్రెస్ బలంగా లేదని కూడా ఆయన ఎలా తీర్మానించగలరు. ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్థితులను నిర్మొగమాటంగా పరిశీలిస్తే.. భారాసకు గట్టిపోటీ కాంగ్రెస్ నుంచి మాత్రమే ఎదురయ్యేలా ఉంది. భారాస నాయకులు కూడా ప్రతి సందర్భంలోనూ రాబోయే ఎన్నికల్లో తమకు పోటీ కాంగ్రెసు నుంచి మాత్రమే ఉంటుందని, ఇతరులను గుర్తించడం లేదని అంటున్నారు.
భారాసకు ప్రత్యామ్నాయం భాజపా అనే భావనను రాష్ట్రప్రజలందరిలోనూ కలిగించే సంగతి తర్వాత.. కనీసం రాజకీయ నాయకుల్లో కూడా కల్పించే వాతావరణం వారికిప్పుడు లేదు. ఎందుకంటే.. భారాస నుంచి బయటకు వస్తున్న వారిలో ఒక్కరు కూడా.. భాజపా మొహం చూడడం లేదు. అందరూ కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు. అలాంటప్పుడు అమిత్ షా కోరిక ఎలా తీరుతుంది?
రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తులుండవని కూడా అమిత్ షా తేల్చేశారట. పొత్తులు పెట్టుకోరు సరే.. కనీసం 119 స్థానాల్లో అభ్యర్థులను మోహరించడానికి చాలినంత బలం వారికి ఉన్నదా అని కూడా ఓసారి సమీక్షించుకుని ఉంటే బాగుండేది. అందుకే అమిత్ షా మాటలు వింటే.. ఆశలావు పీకసన్నం అనిపిస్తోంది!