కేంద్రమంత్రులు, బిజెపి జాతీయ స్థాయి పెద్దలు వచ్చి రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు పెడుతున్నంత మాత్రాన.. ఆయా రాష్ట్రాలపై ఆ పార్టీ ఫుల్ ఫోకస్ పెడుతున్నట్టుగా భావించడానికి వీల్లేదు. కేంద్రం ద్వారా చేపడుతున్న పథకాలు, కేంద్రం అందిస్తున్న సాయం తదితర విషయాలపై తమ డప్పు తామే కొట్టుకోవడానికి దాదాపుగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో బహిరంగ సభలు నిర్వహించాలనే రూట్ మ్యాప్ ను భాజపా చాన్నాళ్ల కిందటే నిర్ణయించుకుంది. అందులో భాగంగానే, ప్రధానంగా భాజపాయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఇలాంటి సభలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విశాఖలో ఆదివారం బహిరంగసభ నిర్వహిస్తున్నారు.
అదే అమిత్ షా 13వ తేదీన తెలంగాణలోని ఖమ్మంలో కూడా ఒక బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అయితే ఈ రెండు బహిరంగసభలను ఒకే గాటన కట్టేయడానికి వీల్లేదు. అక్కడా ఇక్కడా కూడా అమిత్ షా పాల్గొంటున్నారు గనుక.. రెండు రాష్ట్రాల మీద బిజెపి సమానంగా ఫోకస్ పెడుతున్నదని అనుకోవడానికి కూడా వీల్లేదు. కాస్త లోతుగా గమనించినప్పుడు.. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ రాజ్యాధికారాన్ని కూడా చేజిక్కించుకునే ప్రణాళికతో ఉన్నారని, ఏపీలో మొక్కుబడిగా మాత్రమే సభను నిర్వహిస్తున్నారని అర్థమవుతుంది.
ఏపీలో అధికారం మీద ఆశపుట్టేంత స్థితిలో పార్టీ ఉండడమూ, ఏపీలో ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేని పార్టీ కావడమూ మాత్రమే ఇలా అనిపించడానికి కారణం కాదు. ఇంకా ఇతర కారణాలు కూడా ఉన్నాయి.
ఖమ్మం సభ విషయంలో అమిత్ షా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖమ్మంలో తాను అడుగుపెట్టడానికి ముందే.. రాష్ట్రపార్టీలో ఉన్న లుకలుకలను పూర్తిగా సెట్ చేయడానికి డిసైడ్ అయ్యారు. రాష్ట్ర పార్టీలో ఉన్న గ్రూపులను ఏకతాటిమీదకు తేవడానికి ప్రయత్నిస్తున్నారు. బండి సంజయ్ సారథ్యంలో పార్టీ ప్రస్తుతం దూకుడుగానే సాగుతున్నప్పటికీ.. ప్రత్యామ్నాయం కూడా ఆలోచిస్తున్నారు. బండి సంజయ్ కు కేంద్రమంత్రి పదవి కట్టబెట్టి, రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను డికె అరుణ చేతిలో పెట్టి, ప్రచార కమిటీ సారథిగా ఈటల రాజేందర్ ను కీలకంగా మార్చాలని అనుకుంటున్నారు. బండి సంజయ్ ను కేంద్ర కేబినెట్ లోకి తీసుకోకుంటే, పార్టీ ఆయన చేతిలోనే ఉంచి డికె అరుణకు ప్రచార కమిటీ సారథ్యం అప్పగించాలనే ప్లాన్ కూడా ఉంది. ఏది ఏమైనా ఖమ్మం సభకు వచ్చేలోగా.. రాష్ట్ర పార్టీకి సంబంధించిన సంస్థాగత వ్యవహారాలను అన్నింటినీ ఒక గాడిలో పెట్టి.. నాయకుల మద్య ఐక్యతారాగం ఆలపిస్తూ ఖమ్మం నుంచి ఎన్నికల శంఖారావం పూరించాలనేది ఆలోచన.
అదే ఏపీలో విశాఖ సభ విషయానికి వస్తే.. ఇక్కడి నాయకులు సభ ఏర్పాట్లు చూస్తున్నారు. అమిత్ షా వచ్చి ప్రసంగించి వెళ్తారు. అంతే తప్ప.. ఏపీలోని పార్టీ బలోపేతం దిశగా గానీ, అంతర్గత కుమ్ములాటల దిశగా గానీ ఏమాత్రం దృష్టి పెట్టినట్టు లేదు. బిజెపి లో సాంప్రదాయాలకు భిన్నంగా ఏపీనుంచి అనేకమంది సీనియర్ నాయకులు జట్టుగా ఢిల్లీకి వెళ్లి సోము వీర్రాజు వైఖరి మీద ఫిర్యాదు చేసి రావడం కూడా జరిగింది. కానీ వారి ఫిర్యాదులకు కూడా అతీగతీ లేదు. ఈ పరిణామాలను గమనిస్తే ఏపీ మీద బిజెపికి ఎలాంటి ఫోకస్ లేదని మొక్కుబడిగా సభ జరుగుతున్నదని అంతా అనుకుంటున్నారు.
ఈ రెండు సభలకు జరుగుతున్న సన్నాహాలను గమనిస్తేనే రెండు రాష్ట్రాల మీద పార్టీకి ఉన్న శ్రద్ధ అర్థమైపోతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అమిత్‌షా : విశాఖ-ఖమ్మం సభల మధ్య తేడాలే రుజువులు!
Sunday, December 22, 2024