అమరావతి సమాధి పాపంలో బిజెపి వాటా లేదా?

Monday, December 23, 2024

బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఓ బహిరంగ సభ నిర్వహించారు. కేంద్రం చేపడుతున్న అభివృద్ధి పథకాలను జాతీయ నాయకులే దేశమంతా తిరిగి ప్రచారం చేయాలనే బిజెపి వ్యూహంలో భాగంగానే ఈ సభ జరిగింది. అయితే ఈ సభలో రాష్ట్రప్రభుత్వ వైఫల్యాల మీద కూడా జెపి నడ్డా ఒక రేంజిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ల్యాండ్ స్కామ్, లిక్కర్ స్కామ్ జరుగుతున్నాయంటూ విమర్శలు చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తయారుచేశారని జెపి నడ్డా ఆవేదన వ్యక్తం చేయడం విశేషం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ రాజధాని లేని రాష్ట్రంగా అనాధలా నిలబడి ఉన్నదంటే ఆ పాపంలో భారతీయ జనతా పార్టీకి భాగం లేదా? అనేది ప్రజల ప్రశ్న. ఎందుకంటే తాను అధికారంలోకి వచ్చిన వెంటనే.. మూడు రాజధానుల కాన్సెప్టును తీసుకువచ్చిన జగన్, సీఆర్డీయేను రద్దుచేసేసి అమరావతికి సమాధి కట్టారు. 35 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల నోళ్లలో జగన్ మట్టికొట్టారు. వారు కన్నీళ్లతో దీక్షలు చేస్తూ ఉంటే, వారికి పెయిడ్ కూలీలతో పోటీ దీక్షలు చేయిస్తూ, వారి మీద కేసులు పెట్టి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేశారు.
మూడు రాజధానులు అనడం ఉత్తుత్తికే అని, నిజమైన రాజధాని విశాఖ మాత్రమేనని జగన్ కేబినెట్ లోని మంత్రులు అక్కడి ప్రజలతో చెబుతూ ప్రజల్లో అనేక రకాల సందేహాలు రేకెత్తించారు. ఇన్ని రూపాల్లో అమరావతి అనే తెలుగు ప్రజల కలల రాజధానిని సమాధి చేసేశారు.
అయితే ఈ దుర్మార్గానికి కేంద్రంలోని బిజెపి కూడా తన వంతు సహకారం అందించిందనే చెప్పాలి. ఎందుకంటే, మూడు రాజధానుల కాన్సెప్టుతో జగన్ రెచ్చిపోతున్నప్పుడు.. పార్లమెంటులో ఈ అంశం చర్చకు తెచ్చిన ప్రతిసారీ.. రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అంటూ బిజెపి మంత్రులు సన్నాయి నొక్కులు నొక్కారు. తద్వారా వైసీపీ సర్కారులో విచ్చలవిడితనం వచ్చేసింది. తాము ఏం చేసినా అడ్డుచెప్పే వాళ్లే ఉండబోరన్న ధీమా వచ్చింది. దానికి తోడు రాష్ట్ర బిజెపి నాయకులు, జగన్ పట్ల లోపాయికారీ కుమ్మక్కు రాజకీయాలు నడిపిస్తూ వచ్చారు.
ఇవన్నీ ఒక ఎత్తు కాగా.. అమరావతి రాజధాని నిర్మాణం కోసం కేంద్రం వాటాగా ఇవ్వాల్సిన నిధుల గురించి ఢిల్లీ సర్కారు పట్టించుకోనేలేదు. మోడీ వచ్చి శంకుస్థాపన చేస్తేనే ఈ అమరావతి పూర్తి కాలేదని నడ్డా ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోడీ శంకుస్థాపన చేయకపోయినా పర్లేదు గానీ.. నిజానికి ఆయన చేయాల్సింది నిధుల విడుదల. జగన్ సర్కారు వచ్చిన తర్వాత అయినా సరే.. అమరావతి నగర నిర్మాణం కోసం కేంద్రం ఏ కొంచెం నిధులు ఇచ్చి ఉన్నా సరే.. ఆ నిధులు ఎందుకు ఖర్చు కాలేదు.. నగరం ఎందుకు నిర్మాణం కాలేదు అని అడిగే హక్కు వారికి ఉంటుంది. అలాంటిదేమీ లేకుండా, ఇప్పుడు ఎన్నికల వాకిట్లో వచ్చి.. జనాన్ని మభ్యపెట్టడానికి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని నడ్డా చిలకపలుకులు పలడం ప్రజలకు చీదర పుట్టిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles