తెలుగుదేశం పార్టీని అభిమానించేవాళ్లు, చంద్రబాబునాయుడు అభిమానులు అమరావతి నగరాన్ని అద్భుతమైనదిగా అభివర్ణించడంలో వింత ఏమీ లేదు. కానీ, తటస్థుల్లో, చంద్రబాబునాయుడును అభిమానించని లక్షలాది మందిలో కూడా అమరావతి నగరం పట్ల సానుకూల అభిప్రాయం ఉంది. ప్రపంచం తలెత్తి చూసే గొప్ప నగరంగా మన రాష్ట్రం కోసం అమరావతిని రూపొందిస్తానన్న చంద్రబాబు స్వప్నం మీద నమ్మకం ఉంది. అలాంటి వాళ్లంతా కూడా ఈ నాలుగేళ్లలో డీలా పడిపోయారు.
జగన్మోహన్ రెడ్డి మూడుముక్కలాటతో, ఈ రాష్ట్రాన్ని రాజధాని లేని అనాథ రాష్ట్రంగా తయారు చేసేసినప్పటికీ.. హైకోర్టు తీర్పు అమరావతిని అభిమానించే వాళ్లకు కాస్త ఊరట ఇచ్చింది. రాష్ట్రప్రభుత్వం వ్యూహాత్మకవైఖరితో ఆ వ్యవహారాన్ని సుప్రీంకోర్టులో పెట్టేసినప్పటికీ.. అక్కడ భిన్నమైన తీర్పు ఏమీ రాబోదని వారికి ఆశ ఉంది. అమరావతి ప్రాంతంలో నిర్మాణాలను ఆరునెలల్లోగా పూర్తి చేయాలని హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశించినా వీసమెత్తు పనులు కూడా మొదలెట్టకుండా ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చూపిస్తోందో అందరికీ తెలుసు. కొత్త పనుల సంగతి తర్వాత.. 80 శాతం పూర్తయని అధికార్ల క్వార్టర్ల వంటి భవనాలను కూడా పూర్తి చేయడానికి చొరవ తీసుకోకపోవడం మాత్రం ప్రభుత్వ కుట్రగా టీడీపీ వారు మాత్రమే కాదు, అమరావతిని గమనిస్తున్న ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు.
ఇలాంటి నేపథ్యంలో ఐటీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన చంద్రబాబునాయుడు.. అమరావతి ప్రియులకు ఒక చక్కటి శుభవార్త చెప్పారు. ఎవ్వరూ నిరుత్సాహానికి గురికావద్దని చెప్పారు. తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే.. అమరావతిలో నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తామని చంద్రబాబునాయుడు చెప్పారు. ఒక అద్భుత నగరం నిర్మాణం కోసం 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా 35 వేల ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చిన వైనం ఆయన గుర్తు చేశారు. అమరావతి నగరాన్ని కోరుకునే వారిలో చంద్రబాబు కొత్త ఉత్సాహం నింపారు.
జగన్ ప్రభుత్వం తీసుకున్న అనేక దుర్మార్గమైన నిర్ణయాల్లో అమరావతిని శిథిలం చేయాలనుకోవడం కూడా ఒకటి. మూడు రాజధానులలో భాగంగా అయినా సరే.. అమరావతి అనేది లెజిస్లేటివ్ రాజధానిగా జగన్ దృష్టిలో ఉన్నట్టు అనుకోవాలి. కనీసం ఆ మాత్రం ప్రాధాన్యం కూడా ఈ నగరం పట్ల, ఇక్కడ ఆగిపోయిన పనుల పట్ల జగన్ చూపించలేదు. చివరికి ఐఏఎస్ ఉన్నతాధికారుల కోసం నిర్మించతలపెట్టిన పెద్దపెద్ద భవనాలు ఏసీ లు బిగించడంతో సహా పూర్తయిన చోట కూడా మిగిలిన పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం ఉత్సాహం చూపలేదు. మొత్తంగా అమరావతిని శ్మశానంగా మార్చేయాలన్నదే తన కోరిక అన్నట్టుగా చేస్తున్నారనే విమర్శలను జగన్ మూటగట్టుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు మాటలు ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో గమనించాలి.
అమరావతి ప్రియులకు చంద్రబాబు శుభవార్త!
Friday, November 15, 2024