అమరావతి పోరాటంలోకి ప్రియాంక గాంధీ!

Wednesday, January 22, 2025

అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్ ను నాలుగు సంవత్సరాలుగా వినిపిస్తూ అలుపెరగని పోరాటం సాగిస్తున్న రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వారసురాలు ప్రియాంక గాంధీ అడుగుపెట్టబోతున్నారా? మూడు రాజధానులు అనే జగన్మోహన్ రెడ్డి ప్రచారం అంతా ట్రాష్ అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందని ప్రజలకు హామీ ఇస్తూ ఏపీలో ప్రియాంక గాంధీ తమ కాంగ్రెస్ పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేయబోతున్నారా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఎదురవుతున్నాయి. స్వయంగా పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి పోరాటానికి మద్దతు తెలిపేందుకు ప్రియాంక గాంధీ వచ్చే అవకాశం ఉన్నదని చెప్పడంతో ఇలాంటి చర్చ మొదలైంది.

జాతీయ రాజకీయాల కోణంలో పరిశీలించినప్పుడు దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని పార్టీలు కూడా ఏదో ఒక కూటమిలో చేరిపోయాయి. కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమిలో 26 పార్టీలు ఉండగా.. బిజెపి సారధ్యంలోని ఎన్డీఏ లో 39 పార్టీలు ఉన్నాయి. పార్టీల సంఖ్య ఎలా ఉన్నప్పటికీ బలాబలాలు వేరువేరు. మొత్తానికి ఈ రెండు కూటములు కూడా చాలా సీరియస్ గా తలపడబోతున్నాయి.

ఇక్కడ ఒక తమాషా సంగతి ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జనసేన పార్టీ మాత్రమే ఎన్డీఏ కూటమిలో ఉంది. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం ఏ కూటమిలోనూ లేవు. ప్రత్యేకించి ఏపీలో ఆల్రెడీ శవాసనం వేసి ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు చూసే దిక్కే లేదు.

అలాంటి నేపథ్యంలో విపక్ష పార్టీలన్నీ కూడా గట్టిగా మద్దతు పలుకుతున్న అమరావతి పోరాటంలోకి ప్రియాంక గాంధీ స్వయంగా వచ్చి పాల్గొంటారని గిడుగు రుద్రరాజు ప్రకటించడం ఆసక్తికర పరిణామం. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో ఏపీలో సీట్లు గెలిచే స్థాయికి చేరుకోకపోయినప్పటికీ.. రాష్ట్ర విభజన ద్వారా ప్రజలలో ఏర్పడిన ద్వేష భావాన్ని కొంత తగ్గించుకో గల అవకాశం ఉంటుంది. ఆ నమ్మకంతోనే కాబోలు, గిడుగు రుద్రరాజు పాత కాంగ్రెస్ నాయకులందరూ కూడా వైసీపీని విడిచిపెట్టి తిరిగి సొంతగూటికి చేరుకోవాలని పిలుపు ఇస్తున్నారు. ఆయన మాటలు అత్యాశతో కూడుకున్నవి కావచ్చు గాని.. అమరావతికి మద్దతు తెలిపితే మాత్రం పార్టీకి కాస్త పరువు దక్కుతుందని అనుకోవచ్చు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles