అమరవీరుల జ్యోతి స్థూపం అద్భుతమే! కానీ…

Monday, September 16, 2024

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల స్మృత్యర్థం ఒక అత్యద్భుతమైన అమరవీరుల జ్యోతి స్థూపాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం  ప్రారంభించారు. హైదరాబాదులో ఇటీవలే నిర్మించిన నూతన సెక్రటేరియట్ భవనానికి ఎదురుగా, లుంబిని పార్క్ ను ఆనుకొని అత్యద్భుతమైన తెలంగాణ అమరవీరుల జ్యోతి స్తూపాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసింది.. తెలంగాణ ఏర్పడిన తర్వాత దశాబ్ది ఉత్సవాల సందర్భంగా చివరి రోజున ఈ అమరవీరుల స్తూపాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు, రాష్ట్ర సాధన కోసం  సాగిన పోరాటంపై రూపొందించిన ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని కూడా కేసీఆర్ వీక్షించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడిన మాటలు మాత్రం రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాలకు చెందిన అనేక మందికి తీవ్రమైన అసంతృప్తిని కలిగించాయి.

తెలంగాణ రాష్ట్రసాధనకోసం ప్రాణత్యగాలుచేసిన పలువురి కుటుంబీకులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అలాగే తెలంగాణ కోసం స్వప్నించిన ప్రొఫెసర్ జయశంకర్ సేవలను కూడా గుర్తుచేసుకున్నారు. వీరిని మినహాయిస్తే.. కేసీఆర్ ప్రసంగం యావత్తూ.. ఏకపక్షంగా తన సొంతడబ్బా కోసమే సాగిపోయినట్టుగా ప్రజలు విమర్శిస్తున్నారు.

తెలంగాణ అమరవీరులను స్మరించుకోవడాన్ని కూడా కేసీఆర్ రాజకీయంగా మార్చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిజం చెప్పాలంటే.. తెలంగాణ సాధన కోసం జరిగిన కృషిని కేసీఆర్ వివరించలేదు. కేవలం తనను తాను కీర్తించుకోవడానికి, తాను చేసిన పోరాటం, అప్పటి నిరాహారదీక్ష అనేవి మాత్రమే రాష్ట్రాన్ని సాధించిన అస్త్రాలుగా చెప్పుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లుగా కనిపించింది. నిజానికి తెలంగాణ కోసం తపించింది కేవలం కేసీఆర్, అప్పటి తెరాస మాత్రమే కాదు. చాలా పార్టీలలో రాష్ట్ర సాధన కోసం ప్రయత్నం జరిగింది. పార్టీలతో నిమిత్తం లేకుండా, నిస్వార్థంగా రాష్ట్రం కోసం పోరాడిన వారు కూడా ఉన్నారు. ప్రొఫెసర్ కోదండరాం లాంటి వాళ్లు ఐక్య కార్యచరణ సమితిని ఏర్పాటుచేసి నాయకత్వం వహించడం వల్లనే పోరాటానికి ఒక స్పష్టమైన దశ దిశ వచ్చాయి. అయితే అమరులైపోయిన ప్రొఫెసర్ జయశంకర్ ను వ్యూహాత్మకంగా గొప్పగా కేసీఆర్ కీర్తించారు గానీ.. ప్రొఫెసర్ కోదండరాం లాంటి వారి సేవలకు అవమానంగా, కనీసం ఈ కార్యక్రమానికి ఆహ్వానం కూడా దక్కలేదు. అందుకే కేసీఆర్ వైఖరి పట్ల ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కేసీఆర్ తన పాలనలో అద్భుతమైన అమరవీరుల జ్యోతి స్థూపానికి రూపకల్పన చేయగలిగారు గానీ.. దాన్ని రాజకీయంగా ఏకపక్షంగా మార్చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. సొంతడబ్బా తగ్గించుకుని ఉంటే కూడా బాగుండేదని పలువురు అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles