మంత్రి అంబటి రాంబాబు మరింత అభాసుపాలయ్యే ప్రయత్నంలో పడ్డారు. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం బ్రో నిర్మాణంలో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని, వాటి మీద దర్యాప్తు చేయాలని ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయబోతున్నారు. తమ పార్టీకి చెందిన ఎంపీలను వెంటబెట్టుకుని కేంద్ర దర్యాప్తు బృందాలను వ్యక్తిగతంగా కలిసి ఫిర్యాదు చేయడానికి ఆయన ఢిల్లీ వెళుతున్నారు. ఇలాంటి ప్రయత్నం ద్వారా మరింత అభాసుపాలు కావడం తప్ప అంబటి రాంబాబు సాధించేది ఏమీ ఉండదని పలువురు విశ్లేషిస్తున్నారు.
సాధారణంగా సెలబ్రిటీలు చేసే చిత్ర విచిత్రమైన చేష్టలు స్పూఫ్ లుగా సినిమాల్లోనూ, యూట్యూబ్ వీడియోల్లోను మనకు దర్శనమిస్తూ ఉంటాయి. సినిమాల్లో అగ్రతారలు చేసే క్యారెక్టర్ల ప్రవర్తన కూడా స్పూఫ్ గా మరో సినిమాలో కనిపించడం మనం చూస్తూనే ఉంటాం. రాజకీయ నాయకులు కూడా చిత్ర విచిత్ర పనులు చేసినప్పుడు ఆస్పూఫ్ లు సినిమాల్లో కనిపిస్తాయి. ఈ సిద్ధాంతానికి మంత్రి అంబటి రాంబాబు ఎంత మాత్రమూ అతీతం కాదు. ఆయన డాన్స్ చేసిన దృశ్యాలు బ్రో సినిమాలో స్పూఫ్ గా కనిపిస్తాయి. అయితే ఆ వెటకారాన్ని అంబటి రాంబాబు సహించలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ మీద ఆయన రెచ్చిపోయి విరుచుకుపడుతున్నారు.
వ్యక్తిగత జీవితంలో పెళ్లిళ్లు మినహా పవన్ గురించి మరొక మాట నెగటివ్ గా మాట్లాడడానికి అవకాశం లేని అంబటి రాంబాబు, ఆయన వ్యక్తిగత జీవితం గురించి తను సినిమా తీస్తానంటూ స్క్రిప్ట్ సిద్ధమవుతుందని సెలవిస్తున్నారు. పెళ్లి పెటాకులు, మూడు ముళ్ళు ఆరు పెళ్లిళ్లు ఇలాంటి రకరకాల వెటకారపు టైటిల్స్ ను ఆయన ప్రకటించారు.
దానితోపాటు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ కు ఇవ్వదలచిన ప్యాకేజీ సొమ్మును ఈ చిత్ర నిర్మాత విశ్వప్రసాద్ ద్వారా అందించారని, విదేశాలలో తెలుగుదేశం పార్టీ వసూలు చేసిన కోట్ల రూపాయల మొత్తం ఎన్నారై అయిన నిర్మాత ద్వారా పవన్ కు చేరాయని అంబటి రాంబాబు మోకాలికి బోడి గుండు కి ముడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన రెమ్యూనరేషన్ లెక్కలు తేలాలని ఆ మొత్తం గురించి ఆయన ఇన్కమ్ టాక్స్ పే చేశారా లేదా అనేది కూడా తేలాల్సి ఉందని అంబటి అంటున్నారు. ఈ పసలేని ఆరోపణలతో ఆయన ఆగడం లేదు. ఢిల్లీ వెళ్లి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని కూడా అంటున్నారు. అయితే ‘ఇలాంటి ఆరోపణలేవీ ఎప్పటికీ నిగ్గు తేలేవి కాదు’ అనే సంగతి ఆయన గ్రహించడం లేదు. ఢిల్లీ వెళ్లి పితూరీలు చెప్పినంత మాత్రాన సినిమా లెక్కల్లో లొసుగులు బయటకు వస్తాయని అనుకోవడం భ్రమ అని పలువురు భావిస్తున్నారు.