పార్టీని ధిక్కరించే మాటలు మాట్లాడేవాళ్లు. తిరుగుబాటు స్వరం వినిపించేవాల్లు, ముఠా తగాదాలకు ప్రయారిటీ ఇస్తూ పార్టీకి చేటుచేసేవాళ్లు.. ఇలాంటి ఎమ్మెల్యేలు చాలామందే ఉంటారు. వాళ్లందరి మీద కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పీకల్దాకా కోపం ఉంటుంది. అయినా సరే.. ఆయన స్వయంగా వారిని పిలిపించి బుజ్జగించడమూ, వారి కడుపుమంట కారణాలు తెలుసుకోవడమూ, ఆ ముఠాల మధ్య రాజీ కుదర్చడమూ అనేది జరగని పని. అలాంటి ఇంపార్టెంటు పనులను కూడా జగనన్న తరఫున పార్టీలోని ఇతరులే నిర్వర్తిస్తుంటారు. అలాంటిది జగనన్న స్వయంగా అపాయింట్మెంట్ ఇచ్చి పిలిపించి మాట్లాడడం అనేది విశేషమే. అలాంటి అరుదైన అవకాశం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి దక్కింది. అన్న పిలిచి బుజ్జగించారు గానీ.. స్థానికంగా ప్రభుత్వ వైఫల్యాల మీద ఆ ఎమ్మెల్యేకు ఆగ్రహం మాత్రం ఇసుమంతైనా చల్లారలేదు.
తన నియోజకవర్గంలో పనులు మందగమనంలో పడితే గనుక.. అధికారుల మీద నిప్పులు చెరిగే ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పేరుంది. తాను అధికార పార్టీ ఎమ్మెల్యేనే అయినప్పటికీ.. పనులు జరక్కపోతే.. నడిరోడ్డు మీద కూర్చుని, బురదగుంటలో దిగి అయినా దీక్షలు చేయడం ఆయన నైజం. ఇటీవల పెన్షను లబ్ధిదార్లలో కోత విధిస్తున్నారంటూ పెద్దప్రచారం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా మూడువేల మంది వరకు ఇలాంటి నోటీసులు ఇచ్చారు. అయితే ఈ పోకడపై కోటంరెడ్డి ఫైర్ అయ్యారు. తన నియోజకవర్గంలో ఏ ఒక్కరికి పెన్షను తొలగించినా ఊరుకునేది లేదని నిప్పులు చెరిగారు. అలాగే రాష్ట్రఆర్థిక శాఖ అధికారులు మీద కూడా విమర్శలు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఇలా మాట్లాడడం అనేది సర్వత్రా చర్చనీయాంశం అయింది.
ఎట్టకేలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కోటంరెడ్డిని పిలిపించారు. తనకు సన్నిహితుడైన ఎమ్మెల్యే కావడంతో బుజ్జగించడానికే పిలిపించి ఉంటారని, పార్టీ- ప్రభుత్వం పరువు పోయేలా బహిరంగంగా మాట్లాడవద్దని చెప్పడానికే పిలిపించి ఉంటారని అంతా అనుకున్నారు. వారి భేటీ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి మాత్రం ఏం తగ్గినట్టు కనిపించలేదు. తన నియోజకవర్గంలో అధికారులనుంచి సహకారం లేదని, ముఖ్యమంత్రికి కూడా ఈ విషయమే చెప్పానని ఆయన అనడం విశేషం.
ఆనం, వరప్రసాద్ తరహాలో నెల్లూరుజిల్లాలోనే పార్టీ మీద తిరుగుబాటు స్వరం వినిపిస్తున్న సొంత ఎమ్మెల్యేలు ఇంకా ఉన్నారు. వారిని సీఎం పట్టించుకోలేదు. వచ్చే ఎన్నికల నాటికి వారిని పక్కన పెడతారనే ప్రచారం ఉంది. కోటంరెడ్డిని మాత్రం స్వయంగా పిలిపించి మాట్లాడారు గానీ, ఆయనలోని ఆవేశం చల్లారేలా సర్దిచెప్పలేకపోయారు.!
అన్న బుజ్జగించినా ఆవేశం చల్లారలేదు!
Tuesday, November 12, 2024