ఏపీలో చాలా తమాషా రాజకీయ పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో రాజకీయం బాగా వేడెక్కిన వాతావరణం ఉంది. అదే సమయంలో దాదాపుగా అన్ని పార్టీల్లోనూ ఒక తెలియని స్తబ్ధత కూడా ఉంది. కొద్దిమంది నాయకులు తప్ప క్షేత్రస్థాయిలో నాయకులు చురుగ్గా కదలడం లేదు. తమ తమ పార్టీలకు అనుకూలంగా ఏదో మాటలు మాట్లాడుతున్నారే తప్ప.. క్రియాశీలంగా ఎన్నికల గోదాలోకి దిగినంత దూకుడుతూ ఏ పార్టీవారు కూడా వ్యవహరించలేకపోతున్నారు. అధికారపక్షంలో ఒక కారణంగా, విపక్షాలలో మరో కారణంగా అభ్యర్థిత్వాలపై చెప్పలేనన్ని సందేహాలు నెలకొని ఉండడమే ఇందుకు కారణం.
ఏపీలో ఎన్నికల వాతావరణం ఎంతగా వేడెక్కుతున్నదో.. అంత సందిగ్ధంగానూ ఉంది. ఒకవైపు నాయకులు రెచ్చిపోయి.. రేపో మాపో ఎన్నికలు జరగబోతున్నాయన్నంత ఆవేశంగా వేడిగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. మాటల బాణాలు సంధిస్తున్నారు.
మామూలుగా అయితే అధికార పార్టీలో ఎలాంటి సందిగ్ధం ఉండకూడదు. కానీ.. ఇక్కడ రూటే సెపరేటు. సాధారణంగా అన్ని పార్టీలూ ‘సిటింగులు అందరికీ టికెట్లు’ అనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంటాయి. అడపాదడపా ఒకరిద్దరికి తిరస్కరిస్తాయి కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి ఈదఫా తన సొంత పార్టీ ఎమ్మెల్యేలను డౌట్లలోకి నెట్టేశారు. నాదగ్గర ఉన్న సర్వే రిపోర్టుల్లో మీ పనితీరు బాగాలేదు.. ఇంకా చాలా మంది మెరుగుపరచుకోవాలి. లేకపోతే టికెట్లు ఇవ్వను.. అంటూ చాలా కాలంగా బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపులకు దాదాపు యాభై మంది ఎమ్మెల్యేలవరకు అభద్రతలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందో లేదో అనే ఫీలింగ్ మధ్య బతుకుతున్నారు. చురుగ్గా ఉండలేకపోతున్నారు.
ఇదే దౌర్భాగ్యం ప్రతిపక్ష పార్టీల్లో కూడా ఉంది. జనసేన- తెదేపా పొత్తు కుదురుతుందా లేదా అనేది చాలా కీలకం. ఆ సంగతి తేలక తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు కూడా సందిగ్ధంలో ఉన్నారు. తమ తమ పరిధిలో ఎంత మేర ఇప్పటినుంచి కలిసి మెలిసి పనిచేయాలో వారు తేల్చుకోలేకపోతున్నారు. ఈ కోణాల్లో చూసినప్పుడు.. ఏపీ రాజకీయాల్లో కీలకంగా తలపడుతున్న రాజకీయ పార్టీల్లో ఎంతో చురుకుదనం- అదే సమయంలో స్తబ్ధత కూడా సమంగా తాండవిస్తున్నట్టు కనిపిస్తోంది.
అన్ని పార్టీల్లోనూ వేడి మరియు స్తబ్ధత
Sunday, December 22, 2024