తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారని తమ పార్టీ ఎమ్మెల్యేలను వైఎస్సార్ కాంగ్రెస్ సస్పెండ్ చేసేసింది. అప్పటినుంచి ఆ ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగానే మెలగుతున్నారు గానీ.. తెలుగుదేశం పార్టీలో చేరలేదు. తాజాగా శుక్రవారం రాత్రి హైదరాబాదులో చంద్రబాబుతో ఆయన నివాసంలో ప్రత్యేకంగా సమావేశం అయిన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, తాను తెలుగుదేశం లో చేరడం గురించి అధికారికంగా ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర పూర్తి కాగానే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోనున్నట్టు ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు.
శనివారం నాడు ఉదయం ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరితో అల్పాహారవిందు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలో నారా లోకేష్ పాదయాత్రను విజయవంతం చేస్తాం అని ఆయన వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఆత్మకూరు నియోజకవర్గ కార్యకర్తలతో ఆనం సమావేశం అయ్యారు. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి, తనకు పట్టున్న నెల్లూరు నియోజకవర్గాల్లోని అనుచరులతో కూడా లోకేష్ పాదయాత్ర సన్నాహాల నిమిత్తం భేటీ కాబోతున్నారు.
నారా లోకేష్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి 13వ తేదీన ప్రవేశించనుంది. జిల్లాలో మొత్తం 33 రోజుల పాటు ఈ పాదయాత్ర సాగుతుంది. అంటే సుమారుగా జులై 15 వరకు జిల్లాలో సాగే అవకాశం ఉంది. జిల్లాలో పాదయాత్ర సాగినంత కాలమూ.. దానిని విజయవంతం చేయడానికి పనిచేస్తారు గానీ.. లోకేష్ పాదయాత్ర ముగిసిన తర్వాత తెదేపా సభ్యత్వం తీసుకుంటా అని ఆనం ప్రకటించడం వ్యూహాత్మక నిర్ణయంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
పాదయాత్ర ముగిసిన తర్వాత అంటే.. ఆనం సభ్యత్వం తీసుకుని, పార్టీ కండువా కప్పించుకునే సరికి జులై నెల మొత్తం గడచిపోతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్పటికప్పుడు ఆయన మీద ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని అనుకున్నప్పటికీ చాలినంత వ్యవధి ఉండకపోవచ్చు. పాదయాత్ర ముగిసిన తర్వాత వెంటనే చేరారని అనుకున్నప్పటికీ.. అప్పటికి సార్వత్రిక ఎన్నికలకు సుమారు 8 నెలల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఆయనమీద వైసీపీ స్పీకరుకు ఫిర్యాదు చేయాలి, స్పీకరు ఆయనకు నోటీసులు ఇచ్చి పిలిపించి వివరణ అడగాలి. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత గానీ అనర్హత వేటు వేయడానికి వీల్లేదు. అందుకు కనీసం రెండు నెలల వ్యవధి పడుతుందని అనుకుంటే.. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ఆరునెలల దూరం మిగులుతుంది. ఆ మాత్రం దూరంలో ఉప ఎన్నిక రావడం అనేది అసాధ్యం. అందుకే వ్యూహాత్మకంగా అనర్హత వేటు పడి ఎమ్మెల్యే పదవి పోతే పోవచ్చు గానీ.. ఉప ఎన్నిక మాత్రం రాకుండా ఉండేలా ఆనం రామనారాయణరెడ్డి ఒక ప్లాన్ ప్రకారం.. తన చేరిక గురించి ఇవాళ అధికారిక ప్రకటన చేశారని అంతా అనుకుంటున్నారు.
అనర్హత వేటు పడకుండా ఆనం వ్యూహం!
Wednesday, January 22, 2025