అనంతబాబు అనే వ్యక్తి మీద అనేక రకాల ప్రచారాలు ఉన్నాయి. అనేకానేక రకాల దుర్మార్గమైన పనులకు, నీచమైన పనులకు పాల్పడుతుంటాడని గతంలో మీడియాలో చాలా ప్రముఖంగా వచ్చింది. చాలా మంది అమ్మాయిలను మోసం చేసినట్లుగా కూడా పుకార్లు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులతో సన్నిహితంగా మెలగుతూ, వారి ప్రెవేటు అవసరాలు తీర్చేవారని కూడా ప్రచారం ఉంది. అలాంటి ట్రాక్ రికార్డు పుష్కలంగా ఉన్న అనంతబాబును.. గౌరవనీయులైన పెద్దలు మాత్రమే ఉంటారని భావించే శాసనమండలిలో సభ్యుడిగా ఎంపిక చేయడమే ఘోరమైన విషయం. తనకు సన్నిహితుడు గనుక.. అనంతబాబుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు.
అదే ఎమ్మెల్సీ అనంతబాబు.. దళితుడైన తన డ్రైవరును హత్యచేసి, శవాన్ని వారి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే.. ఆ కేసును నీరుగార్చడానికి ప్రభుత్వ పరంగా ప్రయత్నం జరుగుతున్నదనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. మొన్నటిదాకా జెయిల్లోనే ఉన్న అనంతబాబు.. బెయిలు దొరకబుచ్చుకుని బయటకు రాగానే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు భారీ ఎత్తున స్వాగతం పలకడం, హత్యకేసులో జైలునుంచి వస్తున్న వ్యక్తి.. ఏదో ఒలింపిక్ బంగారు పతకం సాధించినట్లుగా గజమాలతో స్వాగతం పలకడం అనేది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు అయిన వ్యవహారం.
అయితే.. రాష్ట్రంలో పరిణామాలు, ఈ వ్యవహారాలను గమనిస్తున్న దళితుల మనోభావాలను గమనిస్తోంటే.. ఎమ్మెల్సీ అనంతబాబు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో మరణశాసనం లిఖిస్తారనే అభిప్రాయం విశ్లేషకులకు కలుగుతోంది.
జగన్మోహన్ రెడ్డి.. పైకి ఎన్ని సంక్షేమ పథకాల పేర్లు చెప్పినప్పటికీ.. అధికారం నిలబెట్టుకోవడానికి, మళ్లీ గెలవగలననే నమ్మకాన్ని పెంచుకోవడానికి ప్రధానంగా కొన్ని కులాల మీద మాత్రమే ఆధారపడుతున్నారని అందరికీ తెలుసు. రెడ్డికులం అండను ఆయన ఎంతగా నమ్ముకుంటున్నారో.. అంతకంటె ఎక్కువగా దళితుల్లో కూడా తనకు ఆదరణ ఉన్నదని నమ్ముతుంటారు. తాను క్రిస్టియన్ గనుక.. దళితుల్లో అత్యధికంగా ఉండే క్రిస్టియన్లను తనను నెత్తిన పెట్టుకుంటారని.. ఎవ్వరేం చెప్పినా పట్టించుకోకుండా తనకు ఓట్లేసి గెలిపిస్తారని ఆయనకు నమ్మకం. ఈ రెండుకులాల ఓట్లు సాలిడ్ గా రాబట్టుకుంటే.. మిగిలిన వర్గాల నుంచి నామమాత్రపు ఓట్లు వచ్చినా విజయం ఖరారు అవుతుందనేది విశ్వాసం.
అయితే ఎమ్మెల్సీ అనంతబాబు.. దళిత డ్రైవరును హత్యచేసిన వైనం.. ఆయనను శిక్షించే ప్రయత్నం చేయకపోగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయనను హీరోగా చూసినట్టు చూస్తున్న తీరు దళితులకు ఏవగింపు పుట్టిస్తున్నాయి. జగన్ సీఎం అయ్యాక దళిత, గిరిజనుల పథకాలను 27 పథకాలను రద్దుచేసి వంచించారని మహాసభలో వారు నిందించడం ఒక ఎత్తు అయితే.. ఆ సభలో అనేకమంది ప్రముఖులు.. అనంతబాబు పట్ల పార్టీ వైఖరిని నిలదీయడం గమనార్హం. ఈ నేపథ్యంలో అనంతబాబు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనానికి దారితీయగల, సర్కారుకు మరణశాసనం రాయగల అనేకానేక కారణాల్లో ఒకటి అవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు.
అనంతబాబు.. వైసీపీకి మరణశాసనం రాస్తారా?
Wednesday, January 22, 2025