విశాఖకు ఏపీ రాజధాని తరలిపోతుంది, త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన మొదలు కాబోతోంది.. ఈ మాటలు చాలా కాలంగా చాలా మంది వైసీపీ నాయకుల నోళ్లలో అడపాదడపా వినిపిస్తూనే ఉన్నాయి. ప్రతి పండగకు ముందు.. పండగ తర్వాత విశాఖ నుంచే పాలన అని ఎవరో ఒక వైసీపీ నాయకులు చెప్పడం ఒక అలవాటు అయిపోయింది. ఈసారి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆ బాధ్యత తీసుకున్నారు. త్వరలోనే విశాఖకు రాజధాని తరలిపోతుందని.. తాను కూడా అక్కడకు షిఫ్ట్ అవుతున్నానని సెలవిచ్చారు. రాజధాని తరలింపు దిశగా ఇది అధికారిక ప్రకటన కాదు గానీ.. ఇంచుమించుగా ఆ స్థాయి ప్రకటనే.
విశాఖ రాజధానిగా పరిపాలన సాగించాలనే కోరిక కంటె.. సీఆర్డీయే ప్రాంతం, అమరావతిలో చంద్రబాబునాయుడు తలపెట్టిన రాజధాని అనేది సాకారం కాకుండా చేయడం ఒక్కటే జగన్ లక్ష్యంగా ప్రజలకు కనిపిస్తోంది. అమరావతిలో పనులు పూర్తిచేయడానికి మూడునెలలు, ఆరునెలల గడువును విధించి హైకోర్టు తీర్పు ఇస్తే దానిని జగన్ ఇప్పటిదాకా పట్టించుకోలేదు. పూర్తిగా అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు కేటాయించాలన్నా కోర్టు తీర్పునకు కూడా అతీగతీ లేదు. అలాగని విశాఖలో రాజధాని కోసం స్పష్టంగా ఏమైనా చేస్తున్నారా అంటే అది కూడా లేదు.
వివాదాస్పదమైన, అనుమానాస్పదమైన యారాడకొండ నిర్మాణాలు రాజధాని కోసమే అనే ప్రచారం ఉన్నప్పటికీ.. ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరూ.. రాజధానికి అవసరమైన్ని ప్రభుత్వ కార్యాలయాలు విశాఖలో పుష్కలంగా ఉన్నాయి. అద్దెకు తీసుకోవడానికి కూడా బోలెడు కార్యాలయాలు ఉన్నాయి. తక్షణం రాజధాని ప్రారంబించడానికి కూడా ఇబ్బంది లేదు .. అని రకరకాల మాటలు చెబుతూ ఉంటారు. జగన్ ఢిల్లీలో ప్రకటన చేసిన రోజున కూడా ఆయన బాబాయి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏప్రిల్ కంటె ముందునుంచే విశాఖ రాజధానిగా పాలన మొదలవుతుందని కూడా అన్నారు.
అయితే, రాజధానిని తరలించే విషయంలో నిర్ణయాలు తీసుకునే అధికారమే రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చిన తరువాత.. న్యాయపరమైన అవరోధాలు లేకుండా రాజధానిని తరలించడం అంత ఈజీ కాదనే అంతా అనుకుంటున్నారు. అదే సమయంలో.. ఈ నెలలో జరిగే అవకాశం ఉన్న బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును జగన్ మళ్లీ ప్రవేశపెడతారని, ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన వెంటనే.. రాజధానిని విశాఖకు తరలించేస్తారని కూడా ఒక ప్రచారం ఉంది. ఆ వ్యూహం ప్రకారమే.. త్వరలోనే విశాఖకు రాజధాని తరలిపోతుందని.. జగన్ గ్గోబల్ ఇన్వెస్టర్స్ మీట్ లో ప్రకటన చేశారా? అని పలువురు భావిస్తున్నారు.
ఈ ‘త్వరలో విశాఖకు’ అనే మాటను చాలా మంది నాయకులు చాలా సార్లు చెప్పగా లేనిది.. ఈ సారి జగన్ చెప్పినంత మాత్రాన ఆచరణలోకి వస్తుందా అనే సందేహం ఇంకా చాలా మందిలో ఉంది.